అందంగా కనిపించే వాళ్ళలో కళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కళ్ళు బాగుంటే వారి ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. కళ్ళు పాలిపోయినట్లుగా, అలసటగా కనిపిస్తే అందంగా కనిపించరు. వేసవిలో కళ్ళు మంటలు మండడం, అలసినట్లుగా కనిపించడం జరుగుతుంటుంది. వేసవి తాపానికి కళ్ళకి సమస్యలు వస్తుంటాయి. ఎర్రగా మారడం, వేడి కారణంగా అదోలా ఉండడం, మంటలు కలగడం మొదలగు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వీటి నుండి దూరంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
వేడివల్ల అలసట చెందిన కళ్ళను విశ్రాంతపర్చడానికి చాలా రకాల దారులున్నాయి. వాటిల్లో కొన్ని.
చల్లని నీళ్ళు
అప్పుడప్పుడు చల్లని నీళ్ళతో కళ్ళ మీద చిలకరించుకోండి. దానివల్ల అలసట చెందిన కళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది. లేదంటే కాటన్ తీసుకుని చల్లని నీటిలో ముంచుకుని కళ్ళ మీద కొద్దిసేపు ఉంచండి. కంటి నరాలు విశ్రాంతి చెంది అలసట దూరమవుతుంది.
కలబంద
కలబంద మరో మంచి మేలైన ఆయుర్వేద మూలకం. కలబంద రసాన్ని తీసి, ఫ్రిజర్ లో ఐసు ముక్కల బాక్సులో పెట్టి, ఆ ముక్కలని కళ్ళ మీద ఉంచుకోవాలి. అప్పుడు డల్ గా ఉన్న కళ్ళు ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
దోసకాయ
కళ్ళ సంరక్షణ గురించి ఆలోచన రాగానే మనసులోకి వచ్చేది దోసకాయే. ఫ్రిజ్ లోంచి తీసిన దోసకాయని ముక్కలుగా కత్తిరించి రెండు కళ్ళ మీద రెండు దోసముక్కలని ఉంచాలి. 15నిమిషాల పాటు ఉంచితే మంచి తాజా ఫీలింగ్ కలుగుతుంది. అదీగాక దోసకాయ తోలుని జ్యూస్ గా చేసి అందులో కొంత నిమ్మరసం కలుపుకుని కంటి చుట్టుపక్కల మర్దన చేసినా విశ్రాంత ఫీలింగ్ కలుగుతుంది.
బంగాళ దుంప
బంగాల దుంపలని ముక్కలుగా కత్తిరించి కళ్లమీద పెట్టుకున్నా మంచి ఫలితమే ఉంటుంది. అలా కాకపోతే బంగాళదుంపని జ్యూస్ లా చేసుకుని ఒక వస్త్రంలో పెట్టుకుని కళ్ళమీదు ఉంచుకున్నా బాగుంటుంది.