సుప్రీం కోర్టులో ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సొరేన్​కు ఊరట

-

మైనింగ్ లీజులకు సంబంధించిన వ్యవహారంలో ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అక్రమ మైనింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సోరెన్‌, ఝార్ఖండ్‌ సర్కార్​ అప్పీళ్లను కోర్టు అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది.

హేమంత్‌ సోరెన్‌ గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనకు తానే ఒక గని లీజును మంజూరు చేసుకున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఝార్ఖండ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని విచారణయోగ్య వ్యాజ్యాలుగా పేర్కొంటున్నామని హైకోర్టు జూన్‌ 3న తీర్పు వెలువరించింది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హేమంత్‌ సోరెన్‌, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేసింది. అప్పటిదాకా పెండింగ్‌ పిటిషన్లపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఇవాళ దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై హేమంత్‌ సోరెన్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘సత్యమేవ జయతే’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version