కర్ణాటక సీఎం కుమారస్వామికి స్వల్ప ఊరట.. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు..!

-

తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్ రమేష్‌ను ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు సీఎం కుమారస్వామి సర్కారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయిన విషయం విదితమే. సీఎం కుమారస్వామి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితోనే తాము రాజీనామాలు చేశామ‌ని, తమ రాజీనామాలను ఆమోదించాలని సదరు రెబెల్ ఎమ్మెల్యేలు గతంలోనే ఆ రాష్ట్ర స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆ రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదు. దీంతో ఆ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అయితే సుప్రీం కోర్టు సీఎం కుమారస్వామి సర్కారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

తమ రాజీనామాలను ఆమోదించాలని కర్ణాటక రాష్ట్ర స్పీకర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా స్పీకర్ రమేష్ పట్టించుకోలేదని, తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్ రమేష్‌ను ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై రెబెల్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీ, సీఎం కుమార స్వామి తరఫున న్యాయవాది రాజీవ్ ధావన్, స్పీకర్ తరఫున సింఘ్వీలు తమ వాదనలను న్యాయమూర్తి ఎదుట వినిపించారు.

ఈ క్రమంలో మూడు పక్షాల వాదనలను విన్న సుప్రీం కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. కాగా ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు స్పీకర్‌కు ఉంటుందని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. రాజీనామాల విషయంలో శాసన సభాపతిదే చివరి నిర్ణయమని, అవసరం అనుకుంటే రెబెల్ ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించమని కోరవచ్చని సుప్రీం తెలిపింది. ఈ క్రమంలో బలపరీక్షకు హాజరు కావాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకునే హక్కు రెబెల్ ఎమ్మెల్యేలకు ఉంటుందని కూడా సుప్రీం తన తీర్పులో పేర్కొంది.

రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి హాజరు కావాలని ఎవరూ వారిని బలవంతపెట్టలేరని ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలోనే రేపు కర్ణాటక అసెంబ్లీలో అత్యంత కీలకమైన బలపరీక్ష జరగవచ్చని తెలుస్తోంది. అయితే మరోవైపు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఉన్న పలు హోటల్స్, రిసార్టుల్లో శిబిరాల్లో బస చేస్తున్నారు. మరి రేపటి బలపరీక్షలో సీఎం కుమారస్వామి సర్కారు నెగ్గుతుందో, లేదో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news