వాహ‌న‌దారుల‌కు సుప్రీం కోర్టు షాకింగ్ న్యూస్‌..!

-

కొత్త‌గా బీఎస్‌-4 ప్ర‌మాణాలు ఉన్న వాహ‌నాన్ని కొనుగోలు చేశారా ? అయితే సుప్రీం కోర్టు మీకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆ వాహ‌నాల‌కు గాను రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాటిని రిజిస్ట్రేష‌న్ చేయ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వాల‌కు ఆదేశిచింది. ఈ మేర‌కు జ‌స్టిస్ అరుణ్ శ‌ర్మ నాయ‌క‌త్వంతో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది. లాక్‌డౌన్ కాలంలో తాము అనుమ‌తించిన మేర కాకుండా అధిక సంఖ్య‌లో బీఎస్-4 వాహ‌నాల‌ను అమ్మార‌ని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆ విష‌యంపై ఆగ‌స్టు 13న విచార‌ణ జ‌రుపుతామ‌ని తెలిపింది.

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 27 అనంత‌రం మ‌రో 10 రోజుల పాటు సుమారుగా 1 ల‌క్ష వ‌ర‌కు బీఎస్‌-4 వాహ‌నాల‌ను అమ్ముకునేందుకు మాత్ర‌మే సుప్రీం అనుమ‌తి ఇచ్చింది. కానీ వాహ‌న డీల‌ర్లు ఏకంగా 2.55 ల‌క్ష‌ల వాహ‌నాల‌ను అమ్మారు. ఆ మేర‌కు వాహ‌నాల రిజిస్ట్రేషన్లు కూడా కొన‌సాగుతున్నాయి. అయితే తాము ఇచ్చిన అనుమ‌తి క‌న్నా అధిక సంఖ్య‌లో బీఎస్‌-4 వాహ‌నాల‌ను అమ్మ‌డంతోపాటు వాటిని రిజిస్ట‌ర్ చేస్తుండ‌డంతో ఆ ప్ర‌క్రియ‌ను సుప్రీం కోర్టు తాజాగా నిలిపివేసింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు బీఎస్‌-4 వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ఆపేయాల‌ని తీర్పు చెప్పింది.

అయితే లాక్‌డౌన్ అనంత‌రం మ‌రో 15 రోజుల పాటు బీఎస్‌-4 వాహ‌నాల అమ్మ‌కం, రిజిస్ట్రేష‌న్‌కు గ‌డువు ఇవ్వాల‌ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆటో డీల‌ర్స్ (ఫాడా) జూన్‌లో సుప్రీంను కోరింది. కానీ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డంతో సుప్రీం అందుకు విముఖ‌త వ్య‌క్తం చేసింది. ఇక సుప్రీం కోర్టు మ‌ళ్లీ ఆదేశించే వ‌ర‌కు బీఎస్‌-4 వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌ను ఆపేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version