కరోనా వైరస్ ముక్కు నుంచి గొంతులోకి అక్కడి నుంచి శ్వాసకోశ వ్యవస్థలోకి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే పెద్దల కన్నా పిల్లల్లోనే ముక్కులో కరోనా వైరస్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు వారు కోవిడ్ వచ్చిన పలువురు పేషెంట్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించి విశ్లేషించారు. అనంతరం పై విషయాన్ని నిర్దారించారు.
చికాగో, ఇల్లినాయిస్‌లకు చెందిన 145 మంది కోవిడ్ వచ్చిన పేషెంట్లను సైంటిస్టులు కలిశారు. వారిని మూడు 3 విభాగాలుగా విభజించారు. 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు, 5 నుంచి 17 ఏళ్లు ఉన్నవారు, 18 నుంచి 65 ఏళ్లు ఉన్నవారిగా విభజించి వారి ముక్కులో నుంచి శాంపిల్స్ ను సేకరించారు. అనంతరం వాటిని పరీక్షించారు. ఈ క్రమంలో వెల్లడైందేమిటంటే…
5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల ముక్కుల్లో పెద్దల కన్నా కరోనా వైరస్ కణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ కణాల సంఖ్య పెద్దల కన్నా సుమారుగా 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉందని తేల్చారు. 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో ఇతరుల కన్నా ఇలా కరోనా వైరస్ అధికంగా ఎందుకు ఉంటుందో వారు ప్రస్తుతం తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందుతుందా.. లేదా అనేది వారు వెల్లడించలేదు. దీనిపై కూడా వారు పరిశోధనలు చేస్తున్నారు. అమెరికాలోని అన్ అండ్ రాబర్ట్ హెచ్.లూరీ చిల్డ్రన్స్ హాస్పిటల్, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ వారు సంయుక్తంగా ఈ పరిశోదన చేపట్టగా.. ఈ వివరాలను జామా పీడియాట్రిక్స్‌లో ప్రచురించారు.