గ్రేటర్ ఎన్నికల వాతావరణం హీటెక్కింది. నేతల మాటలు డైనమేట్లలా పేలుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు, విమర్శలకు ప్రతి విమర్శలతో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. గ్రేటర్‌లో మేము అధికారంలోకి వస్తే పాత బస్తీలో సర్జికల్ స్ట్రయిక్ చేస్తామన్న బండి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. మంగళవారం భోలక్‌పూర్‌లో ఎంఐఎం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ హైదరాబాద్‌లో లేదా అని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఎంఐఎం పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని, అది చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ‘బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నాం.. పాతబస్తీలో పాకిస్థాన్ వాళ్లెవరో… రోహింగ్యాలు ఎవరో నిరూపించాలి అని’ అని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ ఆ లెక్కదో సీఎం కేసీఆరే బయటకు తీయాలని అన్నారు. పాకిస్థాన్ వాళ్లెవరో… రోహింగ్యాలెవరో తేల్చాసింది స్తానిక పోలీసులేనని చెప్పుకొచ్చారు. అసదుద్దీన్ చేసిన సవాల్ ను సీఎం కేసీఆర్ స్వీకరిస్తారా.. అని డిమాండ్ చేశారు. 24 గంటల డెడ్‌లైన్.., ఆరోపణలు, ప్రత్యారోపణలతో గ్రేటర్ వార్ హీటెక్కింది.