కౌంటర్ ఎటాక్.. పాకిస్థాన్ పై భారత్ మరో సర్జికల్ స్ట్రయిక్స్..!

-

జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి గుర్తుంది కదా. అసలు మరిచిపోయే దాడా అది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రవాదులపై భారత్ మొత్తం ముక్తకంఠంతో కన్నెర్ర చేసింది. ఆ దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని దేశమంతా నినదించింది. ప్రధాని మోదీ కూడా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

దేశ ప్రజలు కూడా సర్జికల్ స్ట్రయిక్స్ 2.0 జరగాల్సిందే అని పట్టుపట్టారు. అదే జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. బాంబుల మోత మోగించింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగి ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇవాళ తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

దాదాపు వెయ్యి కిలోల బాంబులతో ఎల్వోసీ వెంట ఉన్న తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ సర్జికల్ దాడులను చేసింది. బాలకోట్, చకోటి, ముజఫరాబాద్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ దాడులపై స్పందించిన పాక్.. భారత్ తమ శిబిరాలను ధ్వంసం చేసిందని ప్రకటించింది. పాక్ ఆర్మీ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్ లో స్పందించాడు.

అయితే.. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని ఆయన ట్వీట్ చేసినప్పటికీ.. ఈ దాడుల్లో 200 మంది దాకా ఉగ్రవాదులు మృతి చెందినట్టు తెలుస్తోంది.

యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన తర్వాత.. భారత్ దానికి ప్రతీకారంగా 2016 సెప్టెంబరు 28న ఎల్వోసీ వెంబడి సర్జికల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version