విజయ్​, అజిత్​కు దక్కని ఘనత.. ఆ మూడింటినీ అందుకున్న ఏకైక నటుడిగా సూర్య..

-

టాలీవుడ్​లో బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకరిగా.. బలమైన అభిమాన గణమున్న హీరోల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. ఇటీవలే ఆయన నేడు ‘ఆకాశమే హద్దురా!’ అంటూ జాతీయ ఉత్తమనటుడి స్థాయికి వెళ్ళగలిగాడు. ఆ ప్రస్థానం ఆయన మాటల్లోనే..

‘కనీసం ఫొటో కోసమైనా నవ్వరా బాబూ!’ – అంటుండేవాడు మానాన్న తాను కెమెరా చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ. అలాంటప్పుడే కాదు మామూలుగానే నేను నవ్వేవాణ్ణి కాదు. నలుగురి మధ్య ఎప్పుడూ ఏదో ఆత్మన్యూనతగా ఫీలయ్యేవాణ్ణి. ఏది మాట్లాడాలన్నా తడబాటుతో తబ్బిబ్బయ్యేవాణ్ణి. తల్లిదండ్రులు చదువుకున్నవాళ్లూ సంపన్నులూ కాకపోయినందువల్లే పిల్లలు ఇలా ఆత్మన్యూనతతో బాధపడుతుంటారన్నది చాలామంది భావన. కానీ, నా విషయంలో అది నిజం కాదు. మానాన్న శివకుమార్‌(‘సింధుభైరవి’ ఫేమ్‌) తమిళంలో ఒకప్పుడు పేరున్న హీరో. మేం మరీ సంపన్నులుగా జీవితం గడపకపోయినా… ఆర్థికంగా పెద్ద సమస్యలేవీ ఉండేవి కావు.

అయినా సరే న్యూనత నన్ను పట్టిపీడిస్తుండేది. నేను చదువులో వీక్‌గా ఉండటం ఇందుకో కారణం కావొచ్చు. హోమ్‌వర్క్‌లు సమయానికి పూర్తిచేయలేక, ఇంటికొచ్చే ట్యూషన్‌ మాస్టారుకి దానిపైన ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోవడం అలవాటు చేసుకుని ఉంటానని ఇప్పుడు అనిపిస్తోంది. స్కూల్లోనూ అలాగే కంటిన్యూ అయిపోయాను.ఇక సినిమాల విషయానికొస్తే- నాన్న షూటింగ్‌ సంగతులేవీ ఇంట్లో చెప్పేవారు కాదు. అందరిలాగే టీవీల్లోనూ, దగ్గర్లోని థియేటర్లలోనూ సినిమాలు చూసేవాళ్ళం అంతే. నేను నటుడిగా మారాకే తొలిసారి షూటింగ్‌ చూశానంటే… ఆలోచించుకోండి. అందువల్ల సినిమాల్లో హీరోగా కాదుకదా కనీసం నటించాలన్న ఆలోచన కూడా లేకుండా పెరిగాన్నేను. ఏ కాస్తోకూస్తో ఉన్నా కాలేజీలో జరిగిన ఓ చిన్న సంఘటనతో అది కాస్తా తుడిచిపెట్టుకుపోయింది.

హాలంతా ఘొల్లుమంది!… నేను బీకామ్‌ చదివిన లయోలా కాలేజీలో ఓ రంగస్థల నాటక సంఘం ఉంటే… అందులో చేరాను. మొదటిరోజు సభ్యులందర్నీ స్టేజీపైకెక్కి తమని తాము పరిచయం చేసుకోమన్నారు. నా వంతు వచ్చింది. స్టేజ్‌పైకి అడుగుపెట్టగానే కాళ్ళలోనూ, మైక్‌ పట్టుకోగానే గొంతులోనూ వణుకు మొదలైంది. ‘హలో! ఐయాం శరవణన్‌, డూయింగ్‌ మై డూకామ్‌!’ అన్నాను… బీకామ్‌ అనబోయి. అంతే… హాలంతా ఘొల్లుమంది! నాటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నటనవైపు వెళ్లకూడదనుకున్నాను. డిగ్రీ ముగించేనాటికి మా ఆర్థిక పరిస్థితి దిగజారింది. నాన్న హీరో నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు… నటించే అవకాశాలు ఎప్పుడోకానీ వచ్చేవి కావు. తమ్ముడు కార్తి ఇంటర్‌ చదువుతుండేవాడు, చెల్లెలు బృంద టెన్త్‌లో ఉంది. కాబట్టి పెద్ద కొడుకుగా ఇంటి భారం మోయాల్సిందేనని నిర్ణయించుకుని ఉద్యోగ వేటలో పడ్డాను. కానీ… నేను ఫలానా నటుడి కొడుకునని ఎక్కడా చెప్పదలచుకోలేదు.

రెండు నెలలు తిరిగి ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగం సాధించాను. వాళ్లు అప్రెంటిస్‌గా తీసుకుని చివర్లో… రెండు నెలలకిగాను 1200 రూపాయలు జీతమిచ్చారు. ఆ మొదటి జీతంతో మా చెల్లెల్ని తీసుకెళ్లి అమ్మకో చీరకొన్నా. ఆ చీరని చూసి అమ్మ సంతోషించినప్పుడే నాపైన నాకు కాస్త నమ్మకం వచ్చింది. అప్పటి నుంచి తమ్ముడికీ చెల్లికీ చిన్నపాటి అవసరాలన్నీ నేనే తీర్చసాగాను. ఈ మధ్యలోనే దర్శకుడు వసంత్‌ సాయి నన్ను హీరోగా పెట్టి ‘ఆశ’ సినిమా చేస్తానని నాన్నని అడిగాడు. ఆయన ‘అబ్బే! వాడికి నటనలో అస్సలు ఇంట్రెస్ట్‌ లేదండీ!’ అన్నారు. నన్నడిగితే నేనూ అదే మాట అన్నాను.

సినిమా ఒక్కటే దారి… గార్మెంట్‌ కంపెనీ ఉద్యోగిగా ఉన్న నేను అదే బిజినెస్‌లోకి వెళ్లాలనుకున్నాను. అప్పుచేసి సొంత కంపెనీ పెట్టాను. బిజినెస్‌ కూడా ఫర్వాలేదు అనిపించుకుంది కానీ… ఎందుకో పోనుపోను ఆ రంగంపైన నాకు ఆసక్తి పోయింది. జీవితాంతం అక్కడే ఉండలేను అనిపించి… దాన్ని మూసేశాను. దాంతో పాతికవేల రూపాయల అప్పు మిగిలింది. అది తీరాలంటే సినిమాల్లోకి రావడం ఒక్కటే దారి అనిపించింది! ఒకప్పుడు నన్ను అప్రోచ్‌ అయిన వసంత్‌ సాయిని కాంటాక్ట్‌ అయ్యాను. ఆయన ఫొటోలు తీసుకుని మళ్ళీచూద్దామన్నారు. కొన్నాళ్ళకి మణిరత్నం నిర్మాణంలో తాను ఓ సినిమా చేస్తున్నట్టు చెప్పి విజయ్‌తోపాటూ నటించాల్సి ఉంటుందన్నారు.

నాన్నకి అప్పుడే విషయం చెప్పాను. ఆయన ఈ రంగంలో ఎన్ని కష్టనష్టాలుంటాయో వివరించి వద్దు అన్నారు.నేను వినకుండా ‘నేరుక్కు నేర్‌'(తెలుగులో ‘ముఖాముఖి’) అన్న ఆ సినిమాకి ‘సైన్‌’ చేసేశాను. మణిరత్నంగారే శరవణన్‌ అన్న నా పేరుని సూర్యగా మార్చారు(అది ‘దళపతి’ సినిమాలో రజినీకాంత్‌ పాత్ర పేరు!). నా తొలి షాట్‌కీ ఆయనే దర్శకత్వం వహించారు. ఆరంభం అదిరిపోయింది అనుకున్నాను కానీ… ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.

ఎన్నో అవస్థలు… స్టిల్‌ కెమెరా ముందైనా నిల్చుని నవ్వని వాణ్ణి… మూవీ కెమెరా ముందు ఎలా నవ్వుతాను! దాంతో నా నుంచి నటన రాబట్టడం దర్శకుడు వసంత్‌సాయికి పెద్ద ప్రహసనంగానే మారింది. నవ్వాలన్నా, డైలాగు చెప్పాలన్నా, ఏదో ఒక ఎమోషన్‌ చూపించాలన్నా… గిలగిల్లాడేవాణ్ణి. చుట్టూ ఉన్నవాళ్లు ‘వీళ్ల నాన్న ఎంత మంచి నటుడో… ఇతనంత వేస్ట్‌ఫెలో’ అని మొహానే అనేవారు. ఇక రొమాన్స్‌ సీన్లలోనైతే అటు డ్యాన్సూ రాక… ఇటు ఏ ఎమోషనూ చూపలేక అవస్థలుపడ్డాను. పాటలు చిత్రీకరించిన ప్రతిరాత్రీ కన్నీళ్ళతో నా దిండు తడిచిపోయేది. ఆ బాధలు ఎలా ఉన్నా ‘నేరుక్కు నేర్‌’ విడుదలై సూపర్‌హిట్టయింది. ఈ సినిమాలో నాతోపాటూ పరిచయమైన హీరోయిన్‌లు సిమ్రన్‌నీ, కౌసల్యనీ ఎంతో మెచ్చుకున్నారు. విజయ్‌నైతే ఆకాశానికెత్తేశారు. నన్ను మాత్రం… ఏకిపారేశారు. ‘కెమెరా వెనక నుంచి ఎవరో బెత్తంపట్టుకుని బెదిరిస్తున్నట్టు ప్రతి సీనులోనూ అలా బిత్తర చూపులు చూస్తాడేంటీ? ఇదేం నటన!’ అని ఎగతాళిగా రాశారు. బాగా అవమానంగా అనిపించింది కానీ ఇంకొన్నాళ్లు చూద్దామనుకున్నాను.

ఒకరిద్దరు దర్శకులు ముందుకొచ్చి సెకండ్‌ హీరో పాత్రలిచ్చారు. ఈసారి వెక్కిరింపులు మరీ ఎక్కువైపోయాయి. ఓ రోజు మదురైలో ఓ ఫంక్షన్‌కని వెళ్లి నేనూ, రఘువరన్‌ రైల్లో వస్తూ ఉన్నాం. నేను గాఢ నిద్రలో ఉన్నాను. రఘువరన్‌ మధ్యలో నన్ను లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు… ఏం సాధించావని ఇలా గుర్రుపెడుతున్నావ్‌? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో బతుకుతావ్‌?’ అన్నారు సీరియస్‌గా. ఆ మాటలు గుండెల్లో గట్టిగా నాటుకుపోయాయి.

అప్పట్నుంచి నాకు తెలిసినవాళ్లందరి దగ్గరా… ‘ఫలానా సీన్‌ వస్తే ఎలా చేయాలి? ఇలాగైతే ఎలా నవ్వాలి’ అని ట్యూషన్‌లు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ప్రపంచభాషల్లోని గొప్ప సినిమాలన్నీ చూడటం ప్రారంభించాను. వాటిల్లోని హీరోల హావభావాలు నాకు చాలా సహజంగా అనిపించాయి. అప్పటిదాకా నేనెంత కృతకంగా నటించేవాణ్నో అర్థమైంది. మళ్ళీ విజయ్‌తోనే సెకండ్‌ హీరోగా ‘ఫ్రెండ్స్‌’ అనే సినిమా చేశాను. ఆ చిత్రం విడుదలయ్యాక నన్నెవరూ మెచ్చుకోలేదు కానీ… తిట్టను కూడా లేదు. నేను అదే పదివేలు అనుకున్నాను. అప్పుడే వసంత్‌ సాయి నాతో ‘పూవెల్లాం కేటుప్పార్‌ అన్న సినిమా మొదలుపెట్టారు. హీరోయిన్‌ ఎవరూ అనడిగితే ‘బొంబాయి అమ్మాయి జ్యోతిక’ అని చెప్పారు!

ఫస్ట్‌ కాంప్లిమెంట్‌… నా నటన కాస్త మెరుగుపడ్డా అప్పటికీ నలుగురితో మాట్లాడలేకపోతుండేవాణ్ణి. కానీ జో అలా కాదు… షూటింగ్‌ స్పాట్‌కి వస్తే అందరితోనూ కలిసిపోతుండేది. నేను మౌనంగా ఉన్నా తనే మాట్లాడుతుండేది. రిప్లై ఇవ్వకపోతే బావుండదని ఏదో చెబుతుండేవాణ్ణి. ఆ తర్వాత మేం జంటగా మూడు సినిమాలు చేశాం. నేను తనతో ఎంత ముక్తసరిగా మాట్లాడినా తను లేకపోతే నాకు ఏదోలా అనిపిస్తుండేది. ఓ రోజు ‘సూర్యా! మీ కళ్లు చాలా బావుంటాయి’ అంటూ మెసేజ్‌ పెట్టింది. జీవితంలో ఓ అమ్మాయి నుంచి నేను అందుకున్న తొలి కాంప్లిమెంట్‌ అదే! నాకంటే ముందే తను పెద్ద స్టార్‌ అయిపోయింది. మా అనుబంధమూ అంతే వేగంగా చిక్కనైంది. తనని పెళ్ళి చేసుకుంటానని ఇంట్లో చెబితే ఇష్టంలేదన్నారు. అయినా సరే… నేను వెనకడుగు వేయదల్చుకోలేదు. కానీ… మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూడసాగాను.

నా యాక్టింగ్​ చెత్తగా.. దర్శకుడు బాల తొలి సినిమా ‘సేతు’లో మా నాన్న కూడా నటించారు. ఆ ఫొటోషూట్‌ కోసం ఇంటికి వచ్చారు బాల. నేను ఆయన్ని పలకరిస్తే నేనూ జ్యోతిక కలిసి నటించిన ఓ సినిమా గురించి ప్రస్తావించారు. ‘అందులో జ్యోతిక యాక్టింగ్‌ చాలా బావుంది…’ అని వెళ్లిపోయారు. దానర్థం నా నటన చెత్తగా ఉందనే! అయితేనేం ‘సేతు’ సినిమా తీసిన విధానంగానీ… ఆ ఒక్క చిత్రంతో విక్రమ్‌ పెద్ద స్టార్‌గా మారిపోయిన వైనంగానీ నన్ను నిలవనీయలేదు. ఓ రోజు బాలాని కలిసి ‘మీ దర్శకత్వంలో చెయ్యాలనుంది. హీరోగా కాకపోయినా… ఓ చిన్న పాత్రయినా ఇవ్వండి!’ అని ప్రాధేయపడ్డాను. ఆయనేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాతి వారమే శివాజీగణేశన్‌- అజిత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తీస్తున్నట్టు బాల ప్రకటించారు. దానికి నెల తర్వాత అనుకుంటా… నన్ను పిలిచి, ‘అజిత్‌తో నాకు కుదర్లేదు… ఆ పాత్ర నువ్వు చేస్తావా!’ అని అడిగారు.

వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టనిపించింది. తర్వాతి రోజే ఆయన దగ్గర యాక్టింగ్‌ వర్క్‌షాప్‌కి వెళ్లాను. జ్యోతిక అన్నమాటే ఆయనా చెప్పారు… ‘నీ కళ్లు చాలా బావుంటాయి’ అని. ఇంతకాలం ఆ కళ్లని హైలైట్‌ చేయకపోవడమే నాలోని పెద్ద లోపమని చెప్పారు. డైలాగ్స్‌తో కన్నా కళ్ళతో భావాన్ని పలికించడం ఎలాగో ఆయనే నేర్పారు. నటన అంటే శరీరంలోని ప్రతి అణువూ చేసే పాత్రగా మారడమేననీ ప్రతిపాత్రకీ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ని తీసుకురావాలనీ వివరించారు. ఆయన చెప్పినట్టే ప్రాక్టీస్‌ చేసి నటించాను. ‘నంద’ (తెలుగులో ఆక్రోశం) విడుదలై పెద్ద హిట్టయింది… ఒకప్పుడు తిట్టినవాళ్ళే సూర్యలో ఇంత గొప్ప నటుడున్నాడా అంటూ పొగడ్తలతో ఆకాశానికెత్తారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆ ఏడాది ఉత్తమనటుడిగా అవార్డు అందుకున్నాను.

అప్పుడే ఫస్ట్​ బ్లాక్‌బస్టర్‌… కళ్ళూ నవ్వూ ఆకర్షణీయంగా ఉంటే చాలదు… చెక్కుచెదరని ఆత్మవిశ్వాసమూ ఉండాలి. అందుకోసం నన్ను నేను చెక్కుకోవడం మొదలుపెట్టాను. గొప్పనాయకుల ఆత్మకథలు చదవడం ప్రారంభించాను. నిత్యం పాజిటివ్‌గా ఉండేవాళ్లతో మెలగడం నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడే ‘చెలి’ సినిమా తీసిన గౌతం వాసుదేవ మేనన్‌ ‘కాక్క.. కాక్క'(తెలుగు ఘర్షణ) కథతో వచ్చాడు. ఆ సినిమా కోసం పోలీసువాళ్ళతోనే రోజులతరబడి గడిపాను. వాళ్ల చురుకుదనం, గాంభీర్యాన్ని నా శరీరంలోనూ చూపేందుకు ప్రయత్నించాను. జ్యోతిక కథానాయిక. మా ఇద్దరి కాంబినేషన్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ సినిమా అది! ‘గజిని’కి అలాంటి రిఫరెన్సేమీ దొరకలేదు… అయినా, నాకు నేనే సరికొత్త బాడీలాంగ్వేజ్‌ని ఊహించుకుని ఆ సినిమా చేశాను. నన్ను తెలుగులోనూ స్టార్‌ని చేసిన సినిమా అది! ఇక, ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’తో ఇక్కడా నాకంటూ ఓ పెద్ద ఫ్యాన్‌బేస్‌ని సాధించుకున్నాను. ‘నువ్వూ నేనూ ప్రేమ’లో జంటగా నటించాక నేనూ జ్యోతిక పెళ్ళిపీటలెక్కాము. క్లాస్‌తోపాటూ మాస్‌ సినిమాలైతే మరింత రీచ్‌ ఉంటుందనే ‘సింగం’ సిరీస్‌ సినిమాలకి ఒప్పుకున్నాను. ఎంత మాస్‌ సినిమా అయినా… కొంత వాస్తవికంగా నటించడానికి ప్రయత్నించడంతో అది అందర్నీ ఆకట్టుకుంది!

ఏ హీరోకైనా ఓ దశలో కొంత స్తబ్దత వస్తుంది. మూడేళ్లకిందట నా పరిస్థితీ అదే. అందులో నుంచి బయటపడాలని చూస్తుంటేనే సుధా కొంగర కెప్టెన్‌ గోపినాథ్‌ జీవిత చరిత్రని సినిమా తీస్తానంటూ వచ్చింది. ఎలా వస్తుందోనన్న సందేహంతో నేను వెనకడుగు వేశానుగానీ జ్యోతిక పట్టుబట్టడంతో ఒప్పుకున్నాను. సుధ నా నుంచి నటన రాబట్టడంలో ఎక్కడా రాజీపడలేదు. ఈ సినిమాలో నేను 17 ఏళ్ల కుర్రాడిగా కనిపించాల్సి వచ్చింది. అలాంటి సీన్స్‌ని గ్రాఫిక్స్‌తో ఎలా చేయొచ్చో హాలీవుడ్‌ సినిమాలని చూపించి వివరించాన్నేను. సుధ ఒప్పుకోలేదు… ఆ పాత్ర కోసం నేను బరువు తగ్గాల్సిందేనని పట్టుబట్టింది. నాకు తప్పలేదు… కంప్లీట్‌ డైట్‌తో 30 రోజుల్లో పది కిలోల బరువు తగ్గి ఆ సీన్స్‌ చేశాను. ఓ రకంగా నిర్మాతగానూ, నటుడిగానూ నేను అందుకుంటున్న ఈ రెండు జాతీయ అవార్డులూ సుధాకొంగరలోని ఆ పర్ఫెక్షనిస్టుకే చెందుతాయి!

సామాజిక సేవ వైపు.. ‘జైభీమ్‌’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేలు నాకు జర్నలిస్టుగా పరిచయమై… స్నేహితుడయ్యాడు. ఉన్నత విద్య చదువుతున్న నిరుపేద విద్యార్థులకి సాయం చేస్తుండేవాడు. ఆ నిజాయతీ, నిబద్ధతా బాగా నచ్చి… తన టీమ్‌తోనే అంతకన్నా పెద్దస్థాయిలో పనిచేయాలని ‘అగరం ఫౌండేషన్‌’ని స్థాపించాను. తమిళంలో అగరం అంటే ‘అ’కారం… అంటే తొలి అక్షరం అని. పేదపిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య, ఉద్యోగ నైపుణ్యాలు అందించడమే మా లక్ష్యం. కానీ మేం కేవలం మార్కుల్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా… ఆ పిల్లల నేపథ్యాన్నీ పరిగణనలోకి తీసుకుంటాం. దేశంలోని ‘ది బెస్ట్‌’ కాలేజీల్లో సీట్లు ఇప్పించడమే కాదు… నేటితరం కార్పొరేట్‌ ఉద్యోగాలకు కావాల్సిన సాఫ్ట్‌స్కిల్స్‌లోనూ శిక్షణ ఇప్పిస్తాం. ఇప్పటిదాకా నాలుగువేలమంది విద్యార్థులకి ఇలా సాయపడ్డాం. వీళ్లలో 1500 మంది ఇంజినీర్లయితే… వంద మంది డాక్టర్లున్నారు. క్వారీల్లో రాళ్లుమోసే వ్యక్తి కూతురూ, ఓ గొర్రెల కాపరి కొడుకూ ఇండియన్‌ ఆర్మీలో వైద్యులుగా నియామకం సాధించిన రోజు… ఎంత సంతోషించానో చెప్పలేను. ఈ పిల్లలు ఎదుర్కొన్న సవాళ్లూ, వాటిని వాళ్లు అధిగమించిన తీరుని విన్న ప్రతిసారీ నేను భావోద్వేగానికి గురవుతుంటాను. వాళ్లకి సాయపడే ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కన్నీళ్ళతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను!

క్షమించమని లేఖ రాశా.. చిన్నప్పుడు అందరి ముందూ బిడియంగా ఉండే నేను…నా తమ్ముడు కార్తి దగ్గర మాత్రం ప్రతాపాన్ని చూపేవాణ్ణి. గిల్లికజ్జాలు పెట్టుకుని బాగా కొట్టేవాణ్ణి. రాత్రుళ్లు దెయ్యంలా వేషం వేసుకుని భయపెట్టి… ఏడిపించేవాణ్ని. వాడు కాస్త పెద్దయ్యాక కొట్టే ధైర్యంలేక శత్రువులా చూసేవాణ్ణి. నా బైకు ముట్టుకున్నా ఒప్పుకునేవాణ్ణి కాదు. వాడు నా నుంచి దూరమై అమెరికాకి వెళ్ళాకే… వాడేంటో నాకు అర్థమైంది. నా అక్కసుని భరించిన వాడి ఓర్పు గుర్తుకొచ్చింది. నేను చేసిన ప్రతిపనికీ పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. అదంతా చెబుతూ సారీ అడుగుతూ ఓ పెద్ద ఈమెయిల్‌ లేఖరాశాను! వాడేమో ‘కొట్టినా తిట్టినా… నువ్వే నా రోల్‌మోడల్‌ అన్నయ్యా!’ అని జవాబు ఇచ్చాడు. అప్పట్నుంచి మేం అన్నదమ్ములుగా కన్నా మంచి ఫ్రెండ్స్‌గా మారాం! వాడి తొలి సినిమాకి పడ్డ కష్టాలు చూసి కన్నీళ్లతో ‘నేను చూసిన గొప్ప నటుల్లో నువ్వూ ఒకడివిరా!’ అన్నాను. వాడి ప్రతిసినిమా ఆ అభిప్రాయాన్ని నిజం చేస్తూనే ఉంది!

అన్నింటా తోడుగా..! ‘జో’ ఉత్తరాది అమ్మాయి కావడంతో మా ఇంట్లో సర్దుకుపోగలదో లేదో అన్న సందేహం… మా పెళ్ళైన కొత్తల్లో ఉండేది. కానీ నాకెప్పుడూ ఆ సమస్య రాలేదు. అమ్మానాన్నా చెల్లీతమ్ముడూ అందరితోనూ ఎంతో ఆప్యాయంగా మెలగడం ప్రారంభించింది. పిల్లలు పుట్టినప్పటి నుంచీ నేను షూటింగ్‌ కాగానే సాయంత్రాల్లో తొందరగా ఇంటికి రావడం తప్పనిసరి చేసుకున్నాను. వారంలో ఒకరోజు పూర్తిగా వాళ్ళతోనే గడుపుతాను. పెళ్ళయ్యాక ‘జో’ సినిమాలు మానేయడం నాకు ఇష్టంలేదు. కానీ పిల్లలు టీనేజీకి వచ్చేదాకా నటించనని తానే పట్టుబట్టింది. చెప్పినట్టే- సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అదరగొడుతోంది. నా సినిమా కార్యక్రమాలకి తను వచ్చినా రాకున్నా… సేవల్లో మాత్రం సదా తోడుంటుంది. తన సూచనతోనే మా పిల్లలు దియా, దేవ్‌ల పేరుమీద 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ సంస్థని స్థాపించాం. మంచి ఆలోచన ఉండి- సినిమా తీయలేక సతమతమయ్యే దర్శకుల్ని ప్రోత్సహిస్తున్నాం. నాకు మంచి పేరుతెచ్చిన ఆకాశమే హద్దురా, జైభీమ్‌ మా నిర్మాణంలో వచ్చినవే!

సూర్య సినిమాల్లోకి వచ్చి ఈ ఏడాదితో పాతికేళ్లు. అతని ప్రయాణంలోని మైలురాళ్లు ఇవి…

అమెజాన్‌ ప్రైమ్‌లో అత్యధికులు చూసిన ప్రాంతీయ సినిమా ‘ఆకాశమే హద్దురా’. ‘జై భీమ్‌’ ప్రఖ్యాత సినిమా సమీక్షా సంస్థ ఐఎండీబీ రేటింగ్స్‌లో 10కి 9.75 రేటింగ్‌ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. హాలీవుడ్‌ క్లాసిక్‌ ‘షషాంక్‌ రిడెంప్షన్‌’పేరుతో ఉన్న పాతరికార్డుని బద్దలు కొట్టింది.

నటులకి సంబంధించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌(క్రిటిక్స్‌ ఛాయిస్‌) అనే మూడు విభాగాలుంటాయి. ఆ మూడింటినీ అందుకున్న ఏకైక నటుడు సూర్యనే.

విజయ్​, అజిత్​ కన్నా ఆ ఘనత సాధించింది మొదట సూర్యనే…

తమిళంలో సూర్యకన్నా విజయ్‌, అజిత్‌లు ముందంజలో ఉన్నా… తెలుగులో సూర్యకి ఆ ఇద్దరికన్నా పెద్ద మార్కెట్‌ ఉంది. అందువల్లే అత్యధిక సంపాదన ఉన్న యువ నటుడిగా 2012, 2013, 2015, 2016, 2017, 2018లో ‘ఫోర్బ్స్‌ 100’ లిస్టులో స్థానం సాధించాడు.

ఆస్కార్‌ అవార్డ్స్‌ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్యనే. ఆ సంస్థ యూట్యూబ్‌ ఛానెల్‌లో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ సినిమా- జైభీమ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version