బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కృష్ణకుమార్ సింగ్ తాజాగా పట్నా పోలీసులను ఆశ్రయించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్ ఆత్మహత్యకు కారణమయ్యారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రియాతో పాటు, మరో ఐదుగురి మీద కేసు నమోదు చేశారు. సుశాంత్ సింగ్ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని తన ఇంట్లో జూన్ 14 న చనిపోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, ముంబై పోలీసులు ప్రశ్నించిన వారిలో రియా కూడా ఉన్నారు. కాగా, ఈ మొత్తం కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని రియా చక్రవర్తి హోంమంత్రి అమిత్ షాను కూడా కోరారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోన్న బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ సైతం రియాపై కేసు నమోదుచేసినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)తోపాటు సెక్షన్ 340, 342ల కింద రియా, ఆమె కుటుంబంపై కేసు నమోదైంది. సుశాంత్ కుటుంబం ఫిర్యాదు చేయగానే పాట్నా నుంచి పోలీసులు ముంబై చేరుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేశారు’’ అని శేఖర్ సుమన్ వరుస ట్వీట్‌లు చేశారు.