కరోనా లాక్‌డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. అనేక కంపెనీలు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోగా.. ఇంకా నష్టం రాకుండా ఉండేందుకు ఉద్యోగులను తొలగించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ కంపెనీలకు కూడా కష్టకాలం వచ్చింది. ఇప్పటికే జొమాటో తన కంపెనీలో 13 శాతం ఉద్యోగులను తొలగించింది. ఉన్నవారికి కూడా 50 శాతం జీతమే ఇస్తామని ప్రకటించింది. ఇక అదే బాటలో స్విగ్గీ కూడా 1100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాకపోతే తమ ఉద్యోగులను ఆదుకుంటామని స్విగ్గీ తెలిపింది.
స్విగ్గీలో తొలగింపబడిన ఉద్యోగులు అందులో 5 ఏళ్లుగా పనిచేస్తుంటే వారికి 8 నెలల జీతం అడ్వాన్స్‌గా ఇవ్వనున్నారు. ఇక మిగిలిన వారికి 3 నెలల జీతం ఇవ్వనున్నారు. అలాగే తొలగింపబడిన ఉద్యోగులకు డిసెంబర్ 31 వరకు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే వారు కొత్త ఉద్యోగాలు వెతుక్కునేందుకు స్విగ్గీ సహాయ పడుతుంది. ఇక దేశంలోని పలు క్లౌడ్ కిచెన్లను కూడా స్విగ్గీ మూసివేసింది.
అయితే లాక్‌డౌన్ ఆంక్షలకు సడలింపు ఇచ్చినా.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు మళ్లీ ప్రారంభమవుతున్నా.. ఇప్పటికిప్పుడు కోలుకునే పరిస్థితి లేనందున ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని.. స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా ఓ లేఖ పంపారు. కాగా కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశంలో నిరుద్యోగం 7 నుంచి ఏకంగా 35 శాతానికి పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు సగటు పౌరున్ని మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.