టీ కాంగ్రెస్ పై పట్టు సాధించే ప్రయత్నంలో ఆ ఇద్దరు నేతలు

-

తెలంగాణ కాంగ్రెస్‌కి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్‌గా నిలవబోతున్నాయి. ఓ వైపు అధికార టీఆర్‌ఎస్‌.. మరోవైపు బీజేపీ మధ్య కాంగ్రెస్ నలిగిపోతుంది. దీనికి నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా తోడైంది. వరస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్‌ని.. కోలుకోకుండా చేయాలని.. ఆ ప్లేస్‌లోకి రావాలని చూస్తోంది బీజేపీ. ఇది గ్రహించిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడిప్పుడే కాస్త దారికి వస్తున్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు స్వయంగా భుజాలపై వేసుకున్నారు సీనియర్‌ నేతలు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిలు చెరో నియోజకవర్గం తీసుకుని పార్టీ పై పట్టు సాధించే ప్రయాత్నాల్లో ఉన్నారు.

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఉన్న నాయకులంతా కాంగ్రెస్‌ సీనియర్లే. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మొదలుకొని జానారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడే ఉన్నారు. ఖమ్మంలో భట్టి..నల్లగొండ, వరంగల్‌లో పీసీసీ చీఫ్‌ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే బిజీ అయిపోయారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఇక్కడ బరిలో ఉన్నారు. రాములు నాయక్‌ సామాజికవర్గం.. ఆయన్ని అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం కలిసి వస్తుందని కాంగ్రెస్‌ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒడిసి పట్టుకోవాలన్నది ఉత్తమ్‌ వర్గం ఆలోచనగా ఉంది.

ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో ఉన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిది పాలమూరు జిల్లానే. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతలను రేవంత్‌ భుజనాకెత్తుకున్నారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కేడర్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ.. నాయకులతో సమావేశమవుతూ ప్రచారంలో మునిగిపోయారు. మూడు జిల్లాల్లో ప్రచారం ఏవిధంగా సాగాలన్న షెడ్యూల్‌ కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్‌ ఓటర్లను కలిసే ప్రయత్నంలో ఉన్నారు రేవంత్‌. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభివాణి బరిలో ఉండటంతో.. కాంగ్రెస్‌ ఓటు చీలకుండా అందుకు తగ్గట్టుగానే వ్యూహ రచనలో ఉన్నారట.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో ప్రచారంలో ఉన్న ఉత్తమ్‌, రేవంత్‌ల మధ్య సరికొత్త ఆధిపత్య పోరు మొదలైందని టాక్‌. వరస ఓటములతో పడిన మచ్చను తొలగించుకునే పనిలో ఉత్తమ్‌ ఉంటే.. పీసీసీ చీఫ్‌ పీఠాన్ని ఎలాగైన ఈ విజయంతో అధిరోహించాలని అనుకుంటున్నారట రేవంత్‌. ఆ విధంగా పార్టీపై పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version