సాధారణంగా కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ఎవరైనా సరే వాహనానికి అయ్యే ఖరీదుతోపాటు ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కూడా వాహన షోరూంల నిర్వాహకులకే చెల్లిస్తారు. అయితే ఇకపై అలా కుదరదు. వాహనదారులు వాహన ఖరీదును మాత్రమే షోరూంలకు చెల్లించాలి. ఇక ఆ వాహనాలకు అయ్యే ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ఇన్సూరెన్స్ అందజేసే కంపెనీలకే నేరుగా చెల్లించాల్సి ఉంటుంది.
కొత్తగా మనం వాహనం కొన్నాక షోరూంల నిర్వాహకులు ఇన్సూరెన్స్ కంపెనీలకు, మనకు మధ్య వర్తులుగా ఉంటారు. ఈ క్రమంలో మనం వాహన ఖరీదుతోపాటు దానికి అయ్యే ఇన్సూరెన్స్ మొత్తానికి చెందిన ప్రీమియంను కూడా షోరూంల నిర్వాహకులకే చెల్లిస్తాం. దీని వల్ల మన వాహనానికి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత వస్తుంది అనే విషయం మనకు తెలియదు. ఈ క్రమంలో షోరూంల నిర్వహకులు మన నుంచి ఎక్కువ మొత్తంలో ప్రీమియంను వసూలు చేస్తుంటారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రం వారు తక్కువ ప్రీమియం చెల్లిస్తారు. దీంతో మనకు నష్టం కలుగుతుంది.
అయితే ఇలా జరగడాన్ని నియంత్రించేందుకు గాను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ) వాహనదారులకు సూచనలు చేసింది. కొత్తగా వాహనం కొన్నప్పుడు వాహనం ఖరీదును మాత్రమే షోరూంలకు చెల్లించాలని, ఇన్సూరెన్స్‌ను విడిగా తీసుకోవాలని, ఇన్సూరెన్స్‌ను అందజేసే కంపెనీలకే నేరుగా ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ పొందవచ్చని సూచించింది. కనుక వాహనం కొనేవారు ఐఆర్‌డీఏ సూచించిన విధంగా చేస్తే తాము తమ నూతన వాహనానికి ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నామనేది సులభంగా తెలిసిపోతుంది. షోరూంల వారు చేసే మోసాన్ని అరికట్టవచ్చు.