ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కోసం చూస్తున్నారా ? అయితే దాన్ని మీరు ఉచితంగానే పొందవచ్చు. ఎలాగంటే.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్‌ను పొందవచ్చు. అయితే ఈ పథకం కేవలం పరిమిత కాల వ్యవధిపాటు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే గడువు తేదీని నిర్ణయించారు. అందువల్ల కేవలం వారం రోజుల్లోనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పీఎంయూవై పథకాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంది. దీని వల్ల పేదలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది. ఈ పథకానికి ఎవరైనా సరే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి గడువును ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.
ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఇలా చేయాలి…
* లబ్ధిదారులు ముందుగా pmujjwalayojana.com అనే సైట్‌ను సందర్శించాలి. అందులో డౌన్‌లోడ్ ఫాం అనే బటన్‌ను క్లిక్ చేయాలి. అనంతరం ఫాం ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
* ఆ ఫాంలో వివరాలను నింపాలి. తరువాత దాన్ని గ్యాస్ ఏజెన్సీలో అందివ్వాలి.
* లబ్ధిదారులు ఆ ఫాంతోపాటు అన్ని అవసరం అయిన పత్రాలను జతచేయాలి.
* దీంతో ఫాంను వెరిఫై చేసి గ్యాస్ కనెక్షన్‌ను ఉచితంగా ఇస్తారు.
పీఎంయూవై (ప్రధాన మంత్రి ఉజ్వల యోజన) పథకాన్ని మోదీ ప్రభుత్వం మే 1, 2016లో యూపీలోని బలియా అనే ప్రాంతంలో మొదట ప్రవేశపెట్టింది. వెబ్‌సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఈ పథకం కింద 8 కోట్లకు పైగా ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారు. 2019, సెప్టెంబర్ 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 719 జిల్లాల్లోని లబ్ధిదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఈ పథకం వల్ల పేదలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లను ఇస్తున్నారు. దీంతో వారు కట్టెల పొయ్యి మీద ఆధార పడి అనారోగ్యాలకు గురి కాకుండా వంట గ్యాస్‌తో వంట చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు.