అద్భుతమైన వారసత్వ సంపద మనది. హెరిటేజ్ యాక్ట్ కింద భద్రపరచాలి సుమా..! తల్లి గోదారి తనకుతనే తల్లడిల్లి ఎటునుంచి ఎటు పోతుందో అర్థంకాక, జుట్టు..సారీ గడ్డి పీక్కుంటోంది. జలవనరులపై సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ ప్రతిభను చూస్తే పాపం.. కేసీఆర్‌కు ఆ రంగంలో అ..ఆ.లు కూడా తెలియవు. హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రాజెక్టులపై పడుకోవాల్సిందే.
ఎవరి వారసులు వారి తాతతండ్రుల వృత్తినే నమ్ముకోవాలి. చెప్పులు కుట్టుకునే వాడి కొడుకు అదే పని చేసుకోవాలి. డాక్టరు పిల్లలు డాక్టర్లే కావాలి. కాబట్టి మంత్రుల కొడుకులు మంత్రులే కావాలి. ఈ సూత్రీకరణలన్నీ గత ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన సాయికిరణ్ యాదవ్ గారివి. తాజాగా నాగరాజు గారి ఇంటర్వ్యూలో తనలోని ప్రతిభాపాటవ విశేషాలను అప్రతిహతంగా విరజిమ్మాడు.
గోదావరి నది ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలోకి ప్రవేశించి, అక్కన్నుంచి ఓ పాయ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకి పోయి పోలవరం నిండుతుందంట. 18 లేక 100 కిలోమీటర్లే.. జస్ట్.. అంతే.
అయ్యా.. సికింద్రాబాద్ ఓటరు మహాశయులారా..! మీర పనిగట్టుకుని ఆయన్ని ఓడించారు గానీ, లేకపోతే, తన అపార విజ్ఞాన సంపదతో మీ నియోజకవర్గాన్ని మొత్తం అభివృద్ధిపథంలో నడిపిఉండేవాడు కదా.! అనవసరంగా హోం శాఖతో సరిపెట్టుకున్నారు.
ఇప్పటికయినా ఏం పర్లేదు.. మీరు మీ పనులపై దృష్టి పెట్టండి. రేపు మీ పిల్లలు కూడా మీ పనే చేయాల్సిఉంటుంది. సాయికిరణ్ గారు అందుకోసం చేయదగ్గ సహాయం ఎప్పుడూ చేస్తారు. 2024లో మరింత పరిణితి చెంది, బాధ్యత కలిగిన నాయకుడిగా సికింద్రాబాద్‌కు సముద్రం తీసుకొచ్చే దిశగా విశ్యప్రయత్నం చేస్తారు. ఈపాటికే తన ప్రయత్నం మొదలుపెట్టి ఉంటారని నా అనుమానం.
– చంద్రకిరణ్