రాష్ట్రంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది పేదలు లబ్ధి పొందారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని లబ్ధిదారుల కోసం రాష్ట్ర సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ఇవాళ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఏకకాలంలో రాష్ట్ర మంత్రులు తలసాని, హరీశ్ రావు, మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు.
మొదటగా కుత్బుల్లాపూర్, బాచుపల్లిలో డబుల్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో తలసాని పాల్గొని పంపిణీని ప్రారంభించారు. దేశ చరిత్రలో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్ రూంలు ఇవ్వడం అద్భుతమని తలసాని కొనియాడారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న కుటుంబాలను అధికారులు వడపోసి ఎంపిక చేశారని తెలిపారు. తొలి విడతలో రానివారు బాధపడొద్దన్న మంత్రి తలసాని మిగతా దశల్లో వస్తుందని భరోసా ఇచ్చారు.