విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా రిలీజ్ కు ముందు వున్న హైప్ చూస్తే అందరూ ఇది 500 కోట్ల సినిమా అనుకున్నారు. ఎందుకంటే విజయ్ ఇండియా మొత్తం చుట్టి సూపర్ హైప్ తెచ్చాడు. ఇక అందులోనూ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ నటించాడు అని ఉదరగొట్టారు. ఇక ఇంటర్వ్యూ లలో పూరి, ఛార్మి చూపిన కాన్ఫిడెన్స్ తో ఇదేదో బ్రహ్మాండమైన సినిమా అని అందరూ ఆశలు పెట్టుకున్నారు. పైపెచ్చు మంచి రేటుకు ఓటిటి వాళ్ళు అడిగినా ఇవ్వలేదు అనేసరికి బయ్యర్స్ వేలం వెర్రిగా ఎగబడి ఎక్కువ పెట్టి కొన్నారు.
ఇక విడుదల తర్వాత సినిమా మీద విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దానితో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు అందరూ నష్టాల పాలు అయ్యారు. అయితే ఇప్పుడు బయ్యర్స్ డబ్బులు కోసం డిమాండ్ చేసే సరికి, పూరీ జగన్నాథ్ ఒక ఆడియోలో నాకు రావాల్సిన డబ్బులు వున్నాయి అవి వచ్చిన తర్వాత ఇస్తా, పిచ్చి వేషాలు వేస్తే రూపాయి కూడా రాదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
ఇప్పుడు ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు. ఒక సినిమా తీయటం దర్శకుడి పని , అలాగే తన సినిమాని ఎంతకు అమ్మాలో ధర నిర్ణయించేది నిర్మాత. మీరు ఆ హీరో గత సినిమా ఎంత వసూలు చేసింది, ఇప్పుడు ఎంత పెడితే సేఫ్ అవుతుంది అని మీరు చూసుకొని కొనాలి. అంతే గాని వేలం వెర్రిగా ఎక్కువ రేట్లకు కొని ఇప్పుడు నష్టం భరించాలి అంటే ఎలా అని అన్నారు. అలాగే నేనింతే సినిమా అప్పుడు కూడా ఇలాగే గోల గోల చేశారు అని వ్యాఖ్యానించారు.