కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి సైకిల్ దిగేందుకు సిద్ధమ య్యారు. ఇటీవల టీడీపీపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అనుచరుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉండలేనని సన్నిహితుల వద్ద తెగేసి చెబుతు న్నారు. ఈక్రమంలోనే రామసుబ్బారెడ్డి వైసీపీ నేతలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. అయితే తనకు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి ఇవ్వాలని కోరుతుండగా, దీనిపై వైసీపీ అగ్రనాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రామసుబ్బారెడ్డి కుటుంబానికి టీడీపీతో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా ఆయన టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. ఈక్రమంలోనే జైలు కెళ్లినా బెదరలేదు. పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చారు. 2004 ముందు వరకూ రామసుబ్బారెడ్డి హవా కొనసాగింది. అయితే గత పదిహేనేళ్లుగా ఆయన విజయాన్ని రుచి చూడలేదు. నాలుగు ఎన్నికల్లో వరు సగా ఓటమిపాలవడంతో గత ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యారు. చంద్రబాబు చెప్పినట్లే నడుచుకున్నారు.
తన చిరకాల ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకున్నా రామసుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు తప్పించి పార్టీని వీడలేదు. కాగా మంత్రి పదవి కూడా ఇవ్వడంతో
రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే రామసుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలంటే ఎమ్మెల్సీ వ దులుకోవాల్సిందేనని చంద్రబాబు ఖరాఖండీగా చెప్పడంతో రామసుబ్బారెడ్డి అయిష‌్టంగానే ఎమ్మెల్సీ పదవి వదులుకున్నారు.
ఆదినారాయణరెడ్డి వర్గం తన విజయానికి కృషి చేయలేదని రామసుబ్బారెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ఈక్రమంలోనే ఇక టీడీపీని వీడి అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ఎక్కువ కాలం జమ్మలమడుగులో రాజకీయం చేయలేరన్నది రా మసుబ్బారెడ్డి ఆలోచన. అందుకే వైసీపీలో చేరి జమ్మలమడుగు ఇన్ ఛార్జి పదవిని ఆశించారు. అయితే ఎమ్మెల్యే ఉండగా ఇన్ ఛార్జి పదవి ఎలా ఇస్తామని వైసీపీ అగ్రనేతలు చెబుతున్నారు.
దీంతో రామ సుబ్బారెడ్డి చేరిక విషయం జగన్ వద్ద పెండింగ్ లో ఉందంటున్నారు. దీనికి జగన్ ఒప్పుకోవడం కష్టమే అని కూడా వైసీపీలో చర్చలు నడుస్తున్నాయి. ఇన్ ఛార్జి పదవి కంటే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై రామసుబ్బారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా వేచి చూడాల్సిందే.