తమ్మినేని సీతారాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. భవిష్యత్తులో ఆమదాలవలస నడిరోడ్డు పై తమ్మినేనిని గుడ్డలూడదీసి పరిగెట్టిస్తా అన్నారు. తమ్మినేని ఇంట్లో ఓ ఊరకుక్క అనవసరంగా మొరుగుతోందని స్పీకర్ తమ్మినేని కుమారున్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమదాలవలసలో అబ్బా కొడుకుల దురాగతాలను అంత మొందించడమే నా లక్ష్యం అని..పోస్టింగ్ ల కోసం కక్కుర్తి పడి తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదలనని వార్నింగ్ ఇచ్చారు కూన.
శ్రీకాకుళం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈరోజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. గత ఏడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేత పొందూరు పోలీస్ స్టేషన్ లో ఈరోజు లొంగిపోవడంతో పోలీసులు ఆయనను రాజాం కోర్టుకు తరలించారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా పెనుబర్తిలో అలజడికి కారణం అయ్యాడని పోలీసులు కూన రవికుమార్ పై కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం మామా, అల్లుళ్లు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, కూన రవికుమార్‌ల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. పంచాయతీ ఎన్నికలతో ఈ ఇద్దరి మధ్య వైరం మళ్లీ ముదిరింది. తమ్మినేని స్వగ్రామం తొగరాంలో ఏకగ్రీవం కాకుండా ఎన్నిక అనివార్యమయ్యేలా చేయడంలో తెరవెనుక కూనరవి ఉన్నట్లు తమ్మినేని వర్గం చెబుతోంది. కూనరవి పట్టుదల కారణంగా ఆమదాలవలస నియోజకవర్గం మొత్తంలో ఒకే ఒక్క పంచాయతీని వైసీపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. మరోవైపు ఇదే పంచాయతీ ఎన్నికల్లో తమ్మినేని ఆడిన మైండ్‌గేమ్‌కి కూనరవికుమార్‌కి ఆయన స్వగ్రామంలో షాక్ తగిలింది.
పరిషత్ ఎన్నికల సమయంలో జరిగిన గొడవ తమ్మినేని కుటుంబానికి ఆయుధంలా దొరికింది. ఇక్కడ తమ్మినేని సీతారాం కంటే ఆయన తనయుడు చిరంజీవి నాగ్ చక్రం తిప్పడంతో కూన రవి కుమార్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. పెనుబర్తి పంచాయతీ పరిధిలోని కోటిపల్లి ఎంపీటీసీ స్థానంలో పోలింగ్ రోజు రిగ్గింగ్‌కి సహకరించారనే ఆరోపణలతో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో పోలీసులతో కూనరవి తీవ్ర వాగ్వాదానికి దిగారు. మొత్తం 30 మంది పై పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో కూనరవికుమార్ ను మినహాయించి అందర్నీ అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో కూనరవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఈరోజు పోలీసులకు లొంగిపోయారు.