ఏపీ సీఎం జగనుతో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమారులిద్దరికి కండువా కప్పి జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ విశాఖకు వలస వచ్చిన నేతలే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. విశాఖ వాసిగా రాజధాని వస్తుందనగానే స్వాగతించానన్న ఆయన ఒకవేళ టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. అలానే ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్దమేనన్న ఆయన జగన్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు. వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని, 13 ఏళ్లు టీడీపీకి సేవలందించానని అన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందించే మనస్సు జగనుకుందని, ఈ స్థాయిలో పేదలకు సంక్షేమ పథకాలు అందించడం టీడీపీ వల్ల సాధ్యం కాదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరానన్న ఆయన వచ్చే విశాఖ మేయర్ ఎన్నికల్లో నూరు శాతం సీట్లు గెలిపించుకునేలా కృషి చేసి జగనుకు కానుకగా ఇస్తానని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వాసుపల్లి కుటుంబం కొన్ని దశాబ్దాలుగా విశాఖ ప్రజల కోసం సేవలందించిందని గణేష్ కుమారులు.. భార్య విద్యావంతులని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి సమాజ సేవ చేస్తున్నారని, గణేష్ కుమారులిద్దరూ పార్టీలో చేరారని అన్నారు. వీరి చేరిక పార్టీకి కొండంత అండని అన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలకు టీడీపీలో చాలా మంది ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు. ఏపీలో ప్రతిపక్షమే లేదు.. ప్రతిపక్ష హోదా అనే మాట ఎక్కడుంది..? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.