గతకొన్ని రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తున్నారంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. నిప్పు లేకుండా పొగరాదని తెలిసినా… అబ్బే అవన్నీ తప్పుడు వార్తలు, మా మనసులు చాలా గాయపడ్డాయని చెప్పి టీడీపీలోనే ఉన్నారు కొందరు నేతలు! మిగ్లినవారు కాస్త సైలంటుగా ఉన్నారు. ఈ క్రమంలో మహానాడు పేరుచెప్పి బాబు చేసిన పంచాయతీలు, బేరాలు సక్సెస్ అయినట్లేనని గాసిప్స్ కూడా వచ్చాయి. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఈమాటలు చెబుతూనే సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 10మంది వస్తారా లేక 12మంది వస్తారా అన్న సంఖ్య ఇప్పుడే చెప్పలేమని బాంబు పేల్చారు ఆయన. అక్కడితో ఆగకుండా… సీఎం జగన్, వైసీపీ ముఖ్యనాయకులతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బలరాం మరో బాంబు పేల్చారు. ఇదే క్రమంలో తమ ప్రకాశం జిల్లా నుంచి కూడా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరుతున్నారన్న సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. కాకపోతే ఈ తతంగం అంతా పూర్తవ్వడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.
ఈ సమయంలో టీడీపీ నేతలు వైసీపీలోకి రావడానికి గల కారణాలు రెండని చెప్పే ప్రయత్నం చేశారు బలరాం. అందులో ఒకటి నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాగా.. మరొకటి, తనను నమ్ముకున్న వాళ్లకి జగన్ న్యాయం చేస్తారని అంట. అవును… చంద్రబాబుతో తాము చాలా కాలం ప్రయాణించామని, ఆ సమయంలో ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసు అని మొదలుపెట్టిన కరణం బలరాం… సమయం వచ్చినప్పుడు చంద్రబాబుపై మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు. ఇదే క్రమంలో తనను నమ్ముకున్న వాళ్లకి సీఎం జగన్ న్యాయం చేస్తారని ప్రశంసించారు బలరాం!
మరి నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిజంగానే టీడీపీ నేతలు వైకాపా లో చేరుతున్నారా? లేక బాబు గుండెల్లో బాంబులు వేయాలనే ఉద్దేశ్యంతో బలరాం ఇలా అన్నారా అనేది తెలియాలంటే… ఆ కొంత సమయం గడిచేవరకూ ఎదురుచూడాలి!