రెండు పార్టీలు ఏం చెబుతున్నాయి. ఏం చేస్తున్నాయి. ఈ గందరగోళం నుంచి బయటపడితే ఎవరికి లాభం? ఎవరు ఏ విధంగా నష్ట పోయి గండంలో ఇరుక్కుపోతారు? ఇవన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మూడేళ్ల పదవీ కాలం తీరాక జగన్ ఇంకా వేగంగా కొన్ని పాలన సంబంధ సంస్కరణలు చేయాలని పరితపిస్తున్నారు. ఇదే ఆయనకు ప్లస్ పాయింట్ కూడా ! వీలున్నంత వరకూ ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలనే మరింత సమర్థనీయ రీతిలో అందించేందుకు కృషి చేయనున్నారు. అదేవిధంగా క్షేత్ర స్థాయి సర్వేలు కూడా వేర్వేరుగా చేయాలని చూస్తున్నారు. అంటే పార్టీ తరఫున ఒకటి, ప్రభుత్వం తరఫున మరొకటి చేయించే వీలుంది అని కూడా తెలుస్తోంది. సర్వేల ఫలితాలు ఆధారంగానే టిక్కెట్లు అని కూడా తేలిపోయింది.
పార్టీలో ఉంటూ, పార్టీని ముంచే ప్రమాదకర శక్తులకు మళ్లీ టిక్కెట్లు ఇచ్చే వీల్లేదని చెప్పేశారు ఎప్పుడో ! అదే ఇప్పుడు వైసీపీలో చర్చకు తావిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల అనౌన్స్ మెంట్ ప్లీనరీలో జరిగిపోతే బాగుండు అన్న విధంగా ఓ వాదన కూడా వినిపిస్తోంది. వచ్చే నెలలో జరిగే ప్లీనరీనే అత్యంత కీలకం కనుక ఆ రెండు తారీఖుల్లో (జూలై ఎనిమిది, తొమ్మిది) చర్చ జరిపి, నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి, ఏదో ఒకటి తేల్చేస్తే బాగుండు అన్న వాదన కూడా వస్తోంది. ఏదేమయినా రీజనల్ కో ఆర్డినేటర్లు మరియు పార్టీకి సంబంధించి ఇటీవల నియమించిన జిల్లాల అధ్యక్షులు మాత్రమే కీలకం అవుతారు.
ఇదే సమయంలో టీడీపీ నుంచి కూడా కొంత మేరకు వలసలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేస్తారా లేదా ఆహ్వానం చెప్తారా అన్నది కూడా సంశయాత్మకంగానే ఉంది. బొత్స లాంటి లీడర్లు మాత్రం నిత్యం అసంతృప్తితో రగిలిపోయే వారిని పక్కనపెట్టేయాలని అంటున్నారు. వారి వల్ల పార్టీ ఎదుగుదల ఉండదని అంటున్నారు.ఆ విధంగా టీడీపీ అంసతృప్తులు ఇటుగా వచ్చినా వారిని కూడా కొన్ని షరతులు విధించే తీసుకుంటారు అని కూడా తెలుస్తోంది. ఇక పొత్తుల్లేకుండా టీడీపీ కనుక బరిలో దిగితే వైసీపీ కి మేలు జరిగినట్లే అని చెబుతున్నారు పరిశీలకులు. చూడాలిక రేపటి వేళ అనగా ప్లీనరీ తరువాత ఏమౌతుందో ?