ప్రస్తుతం రాష్ట్ర టీడీపీలో ఎవరూ మాట్లాడడం లేదని.. ఏదైనా వస్తే.. తాను మాత్రమే స్పందించాల్సి వస్తోందని.. ఇటీవల మహానాడు సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తన పార్టీ నేతలను ఉద్దేశించి ఒకింత ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఆయన ఆవేదన విన్న నాయకులు ఔను కదా? నిజమే కదా? అనుకున్నారు. ప్రభుత్వం తరఫున పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగినా.. ప్రభుత్వం విమర్శించినా.. కూడా తాను లేదా.. ఒకరిద్దరు నాయకులు మాత్రమే మాట్లాడుతున్నామనేది చంద్రబాబు ఆందోళన, ఆవేదనగా కనిపించింది. దీనిపై అక్కడే ఉన్న నాయకులు ఒకింత ఆవేదన వ్యక్త పరిచి.. ఇక నుంచి మారతామనే ధోరణిలో మాట్టాడారు.
అయితే, ఈ విషయం తెలిసిన అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ స్థాయి నేత ఒకరు(ఈయన మహానాడులో పాల్గొనలేదు) బాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజమే.. పార్టీ తరఫున మాట్లాడేందుకు ఎందరో ఉన్నారు. కానీ, ఏదైనా కేసు పెడితే.. బాబు వస్తాడా? ఇడిపిస్తాడా? పోవయ్యా.. పో.. ! అంటూ.. తనదైన శైలిలో దులిపేశారు. అంతేకాదు.,. తనంతట తానుగా తన కుటుంబం తరఫున అనేక కేసులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అదేసమయంలో ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా కేసులు పెడుతున్నారని, అన్ని జిల్లాల్లోనూ కేసులు ఎదుర్కొంటున్న నాయకులు ఉన్నారని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడూ వారి(బాబు సామాజిక వర్గం) మాటలే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ వారి మాటలే.. ఇక, మేం ఏం మాట్లాడాలి. వాళ్లే మాట్లాడుకుంటారు. ఎవరైనా నోరువిప్పిమాట్లాడినా.. ఏం జరుగుతుంది.. కేసులు పెడతారు. స్టేషన్ల చుట్టూ తిప్పుతారు. బాబేమో.. పోయి.. హైదరాబాద్లో చక్కంగ కూర్చుంటాడు. ఆయన చేసేదేముంది! మీఛావు మీదే.. అంటాడు. బాబు మారడయ్యో..! అందుకే గమ్ముగున్నాం!! అని ముక్తాయించారు. నిజానికి ఈయనంటే ఒకింత ధైర్యంగా బయటపడ్డాడు కానీ.. చాలా మందిటీడీపీ సీనియర్లలో(అంటే మౌనంగా ఉన్నవారు) ఇదే తరహా అభిప్రాయం ఉండడం గమనార్హం. మరి బాబు మారతారో లేదో చూడాలి.