టీడీపీ టార్గెట్లో ఆ ఏపీ మంత్రి… ఏం జ‌రుగుతోంది…!

-

వైసీపీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు టార్గెట్‌గా టీడీపీ రాజ‌కీయాలు చేస్తోందా? వెలంప‌ల్లిని సెంట‌రాఫ్ చేసుకుని పాలిటిక్స్ ప‌రుగులు పెట్టించాల‌ని భావిస్తోందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. శాస‌న మండ‌లిలో నేరుగా టీడీపీ ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర‌యాద‌వ్‌.. మంత్రి వెలంప‌ల్లిని కాలుతో త‌న్న‌డం, టీడీపీ అనుకూల మీడియాలో వెలంప‌ల్లి కి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు ప్ర‌చా రం చేయ‌డం, పార్టీలో ఆయ‌న పై అస‌మ్మ‌తి పెరిగేలా క‌థ‌నాలు రాయించ‌డం, అదే మంత్రిపై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మంత్రి ల‌క్ష్యంగా టీడీపీ దూకుడు రాజ‌కీయాలు చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి.. ఇంతగా టీడీపీ వెలంప‌ల్లిని ఎందుకు టార్గెట్ చేసింది. గ‌త స‌భ‌ల్లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణను ల‌క్ష్యంగా చేసుకున్న తెలుగుదేశం స‌భ్యులు ఇప్పుడు వెలంప‌ల్లిని ఎందుకు ల‌క్ష్యంగా చేసుకున్నార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. టీడీపీపై ఇటీవ‌ల కాలంలో ఆయ‌న దూకుడుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రెండు.. టీడీపీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, మాజీల‌ను ఆయ‌న పార్టీ మారేలా ప్రోత్స‌హిస్తున్నారు. ఈ రెండు కార‌ణాల‌ను పైకి సీఎం జ‌గ‌న్‌పైకి నెట్టేస్తున్న టీడీపీ నాయ‌కులు.. ప్ర‌త్య‌క్షంగా మాత్రం మంత్రి వెలంప‌ల్లిపై అక్క‌సు పెంచుకున్నార‌నేది వాస్త‌వం.

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది విజ‌యం సాధించిన వెలంప‌ల్లి ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఎక్క‌డ చూసినా .. వైసీపీ జెండా.. అజెండా అమ‌ల‌వుతున్నాయి. అదేస‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున పోరాటం చేయాల్సిన మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌.. ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు వైసీపీ జెండా క‌ప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప‌రిణామాల వెనుక వెలంప‌ల్లి ఉన్నార‌ని టీడీపీ భావిస్తోంది.

అదే స‌మ‌యంలో టీడీపీకి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి, ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావును వైసీపీలోకి తేవ‌డంలోనూ వెలంప‌ల్లి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ కార‌ణాల‌తోనే టీడీపీ ఆయ‌న‌ను టార్గెట్ చేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version