కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. గతంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఏకంగా స్పీకర్‌పైనే పెప్పర్ స్ప్రే చల్లి వివాదాస్పదమయ్యారు. అయితే 2014 ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రం, అటు ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయే సరికి లగడపాటి రాజగోపాల్ దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఎప్పుడో ఒక్కసారి తప్ప చాలా అరుదుగా ఆయన కనిపిస్తున్నారు. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెబుతూ సర్వే వివరాలను బయట పెడతారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కనుక లగడపాటి సర్వే ఒకటి తెరపైకి వచ్చింది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ సర్వే చేయించారని, రాష్ట్రంలో తదుపరి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీయో చెప్పేశారని తెలియజేస్తూ ఓ సర్వే ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో లగడపాటి రాజగోపాల్ సర్వే పేరిట ఈ సర్వే వైరల్ అవుతోంది. అయితే దాన్ని నిజంగా రాజగోపాలే చేయించారా, లేకపోతే కావాలని ఎవరైనా అలా సృష్టించారా తెలియదు కానీ ఆ సర్వే ప్రకారం.. తదుపరి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందట.
ఇక సదరు సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 61 స్థానాలు వస్తాయని, టీఆర్ఎస్‌కు కేవలం 39 స్థానాలు మాత్రమే లభిస్తాయని, ఎంఐఎంకు 7, టీడీపీకి 3, బీజేపీకి 3, సీపీఐకి 2, సీపీఎంకు 1, ఇతరులకు 3 స్థానాల చొప్పున వస్తాయట. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే చెబుతోంది. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పుడే ఇలాంటి సర్వేల ఫలితాలను నిజమని నమ్మలేం. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వస్తే గానీ ఆ విషయం తెలియదు.