రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ పుణ్యమా అని కుండపోత వర్షాలు పడుతున్నాయి. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు పడుతుంటంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇక ప్రాజెక్టులకు కంటిన్యూగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా తెలంగాణలోని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తుతున్న క్రమంలో సోమవారం సాంకేతిక సమస్య ఏర్పడింది. 2, 3 గేట్లలో ప్యానల్ బ్రేక్ కాయిల్ కాలిపోయినట్లు తెలుస్తోంది. వరద ఉధృతితో గేట్లను మరింత పైకి ఎత్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, వెంటనే సమస్యను గుర్తించిన అధికారులు దానిని సరిచేసేందుకు అప్రమత్తమయ్యారు. యుద్ధప్రాతిపదికన గేట్లకు మరమత్తులు నిర్వహించి మరోసారి నీటిని దిగువగు విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.