తెలంగాణలో రాష్ట్రస్థాయి సరిహద్దులు మూసివేతకు పోలీసులు రంగం సిద్ధమైంది. మావోయిస్టులు తెలంగాణ విడిచి, మహారాష్ట్ర, చత్తీస్టడ్ ప్రాంతాలకు తరలిపోతారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో మహారాష్ట్ర,చత్తీస్గడ్ లకు ఈ ప్రాంతం నుంచి వెళ్లే రహదారుల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. భూపాలపల్లి, ములుగు పోలీసు అధికారులు జిల్లాలోని ఉన్న పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్ తో పాటు ప్రత్యేక పోలీసు బలగాలను, గోదావరి పరివాహక ప్రాంతం వెంట కూడా మోహరింపు చేశారు.
తెలంగాణ ప్రాంతంలోని మహదేవపూర్, ఏటూరు నాగారం అడవి గ్రామాల్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చారని పోలీసులకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ గాలింపు చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ తతంగం కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మావోలు తెలంగాణలోని భూపాలపల్లి ఏటూరు నాగారం ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారంతో పోలీసులు, ఒకపక్క రహదారులను దిగ్బంధం చేయడంతో పాటు, మరోవైపు అడవి, అలానే గ్రామాల్లో కూడా పోలీసు బలగాల మోహరించారు.