డీజిల్ సెస్సు పేరిట ఛార్జీలు వరుసగా రెండో సారి కూడా పెంచేసిన టీఎస్ఆర్టీసీ ఇదే ప్రతిపాదనను మన ఉద్యోగులకూ అందించింది. అంటే ఇక్కడ కూడా ఇదేవిధంగా అంతరాష్ట్ర ఒప్పందం అనుసరించి రెండు రాష్ట్రాలలో తిరిగే బస్సులలో ఒకే విధంగా ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. ఇదే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా ఉంది. వాస్తవానికి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాస్త భారం అయినప్పటికీ సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికిప్పుడు ఛార్జీల పెంపుపై ఆసక్తిగా లేదు. ఒడిశాతో పోలిస్తే ఆంధ్రా బస్సుటికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా, తెలంగాణతో పోలిస్తే ఆంధ్రా బస్ టికెట్ రేట్లు మాత్రం తక్కువగానే ఉన్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచితే ఇప్పటి వరకూ వస్తున్న ఆదాయం ఒక్కసారిగా పడిపోతుంది అన్న భయం ఒకటి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులలో నెలకొని ఉంది. ఇప్పటిదాకా తెలంగాణ రూట్లలో తిరుగుతున్న ఆంధ్రా బస్సుల ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మంది ప్రయాణికులు ఏపీ సర్వీసుల వైపే ఆసక్తి పెంచుకుంటున్నారు. ఆ విధంగా రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల మేరకు అదనపు ఆదాయం చేకూరుతుందని తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఛార్జీలు అన్నవి పెంచుకుంటూ పోతే తరువాత కాలంలో ఇబ్బందులు తప్పవని ఏపీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. దీంతో తర్జనభర్జన పడుతోంది.
వాస్తవానికి సూపర్ లగ్జరీ సర్వీసు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో 90 రూపాయల వరకూ తక్కువ అని, అదే విధంగా గరుడ బస్సు సర్వీసు లోటికెట్ ధర టీజీతో పోలిస్తే ఏపీ సర్వీసుకు 30 రూపాయలు తక్కువ అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఛార్జీలు తక్కువ ఉండడంతో ఏపీ బస్సులకు తెలంగాణలో విపరీతం అయిన డిమాండ్ ఉంటుంది. ఓఆర్ కూడా ఆశించిన విధంగా కన్నా ఎక్కువగానే ఉంటోంది. ఈ దశలో డీజిల్ సెస్సు పేరిట టికెట్ ఛార్జీలు పెంచితే తరువాత మొదటికే మోసం వస్తుందని భావిస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ.