రాహుల్ గాంధీ ఈ రోజు తెలంగాణ పర్యటనకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్ లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరంగల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పార్టీ కీలక నేతలంతా రాహుల్ సభ కోసం బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు పనులను దగ్గరుండీ సమీక్షిస్తున్నారు. రాహుల్ గాంధీ టూర్ లో టీ కాంగ్రెస్ లో సరికొత్త ఉత్తేజం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ వంటి అగ్రనాయకుడు వస్తున్నా… కాంగ్రెస్ లో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. తాజాగా ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాహుల్ సభకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీపై గత కొంత కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. గతంలో సీఎల్పీ పదవి ఆశించిన రాజగోపాల్ రెడ్డి అది దక్కకపోవడంతో పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి మాత్రం రాహుల్ సభ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల సన్నాహక సమావేశాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. గతంలో బీజేపీ అనుకూల వ్యాఖ్యలు కూడా చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈనేపథ్యంలో త్వరలో పార్టీ మారుతారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఈరోజు వరంగల్ లో జరిగే సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.