ఏపీలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి ఈ ఘటనలు. అయితే తాజాగా మరో దారుణం సత్యసాయి జిల్లా గోరంట్లలో వెలుగులోకి వచ్చింది. గోరంట్లకు చెందిన విద్యార్థిని (22) తిరుపతిలోని కృష్ణతేజ ఫార్మసీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. అయితే.. గోరంట్ల మండలంలోని మల్లాపల్లికి చెందిన సాదిక్‌తో ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం విద్యార్థినిని కలిసిన సాదిక్ పెళ్లి చేసుకుందామని నమ్మించి.. కారులో తీసుకెళ్లాడు. ఆ తరువాత మల్లాపల్లి వద్ద తన గదిలో బంధించి స్నేహితులతో కలిసి యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. గురువారం ఆమెను హత్య చేసి పైకప్పుకు చున్నీతో వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు బాధిత యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. యువతిని హత్య చేసిన అనంతరం సాదిక్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తమ కుమార్తెను నిందితులు హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే పోలీసులు మాత్రం ఆత్మహత్య కావొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. తమకు న్యాయం చేయాలంటూ గత అర్ధరాత్రి వరకు యువతి మృతదేహంతో బంధువులు గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఉదయం 11.30 గంటలకు నిందితుడు లొంగిపోయినా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించిన బాధిత కుటుంబ సభ్యులు.. మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప బాధితుల తరపున పోలీసులతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలని కోరారు. స్పందించిన డీఎస్పీ రమాకాంత్ రీపోస్టుమార్టం చేయిస్తామని, నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.