మెదక్ పట్టణంలో ఖాదిర్ ఖాన్ అవే వ్యక్తి పోలీసుల థర్డ్ డిగ్రీతో మృతిచెందాడని వస్తున్న ఆరోపణలపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్ పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని, ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ సూచించారు. మెదక్ సీఐ, ఎస్‌ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే.. గత నెల 27న మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీలో గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖదీర్‌ఖాన్‌ను గత నెల 29న అదుపులోకి తీసుకున్నారు. 2వ తేదీ వరకు పీఎస్‌లోనే ఉంచి, ఆ తర్వాత అతని భార్యను పిలిపించి ఖదీర్‌ను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఖదీర్ ఆనారోగ్యం పాలవడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీ రాత్రి మృతి చెందాడు. దొంగతనం కేసులో ఖదీర్‌ఖాన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడంటూ ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.