తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన EAPCET (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) 2024 ఫలితాలను మే 11న విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారికంగా విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉన్నత విద్యాశాఖ అధికారులు పాల్గొననున్నారు. ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది.
ఈ ఏడాది ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరగాయి. ఇందులో ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్-ఫార్మసీ విభాగానికి, మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,20,327 మంది దరఖాస్తు చేసుకోగా, 2,07,190 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగానికి 86,762 మంది దరఖాస్తు చేసుకోగా, 81,198 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షలను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.