తెలంగాణ రాష్ట్రంలోని భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు, ప్రజలకు మరియు రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖను బలోపేతం చేస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును తప్పనిసరిగా జత చేయాల్సిన నిబంధనను దృష్టిలో ఉంచుకుంటే, సర్వే విభాగం కీలక పాత్ర పోషించనుందని మంత్రి అన్నారు. ప్రస్తుతానికి ఉన్న 402 మంది సర్వేయర్లు అవసరాలను తీర్చలేరని, మరిన్ని సర్వేయర్ల అవసరం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ఆధునిక సర్వే పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్ గణితంతో ఉత్తీర్ణత, లేదా ఐటీఐ, డిప్లొమా, బి.టెక్ (సివిల్) వంటి అర్హతలు అవసరం. శిక్షణ ఫీజు రూ.10,000 (OC), రూ.5,000 (BC), రూ.2,500 (SC/ST)గా నిర్ణయించారు.
ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కేంద్రాలలో 50 పని దినాల పాటు తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరంద్ పాల్గొన్నారు.