Breaking : తెలంగాణకు మరో రెండు అవార్డులు

-

కేంద్ర ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. మాతృ మరణాలను పూర్తిగా నివారించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతులమీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ ఎస్ పద్మజ అందుకున్నారు.

దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ విధానంతో నాణ్యమైన ప్రసవ సేవలు గర్భిణులకు మరింతగా చేరువైనట్టు పేర్కొంది. తెలంగాణలో ప్రసవ సేవలను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటివరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను ప్రభుత్వం 49 హాస్పిటల్స్‌లో నియమించింది. వీరు గర్బిణులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వ్యాయామం చేయించడంతో పాటు, మానసికంగా సంసిద్ధం చేయిస్తున్నారు. ప్రస్తుతం మరో 141 మంది శిక్షణ పొందుతున్నారు. వీరు త్వరలోనే అందుబాటులోకి రానున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version