తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా అనుమతివ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజే ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. సమయం దగ్గర పడుతున్నప్పటికీ గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని రాష్ట్ర సర్కార్ కోరింది. శుక్రవారం నుంచి అసెంబ్లీ ఉన్నందున అత్యవసర విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరిపేందుకు సీజే ధర్మాసనం అంగీకారం తెలిపింది.
ఉభయసభలు ఇంకా ప్రొరోగ్ కాకపోవడంతో గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగానే ఈమారు కూడా శాసనమండలి, శాసనసభను సమావేశపరుస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు చేస్తూ గవర్నర్ తమిళిసై ఇంకా అనుమతి ఇవ్వలేదన్న విషయం తెలిసిందే.