గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య మొదలైన వార్ మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనను లెక్క చేయడం లేదని, తగిన మర్యాద ఇవ్వడం లేదని గవర్నర్ తమిళిసై ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట ప్రభుత్వానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా తమిళిసైని మరో రాష్ర్టానికి బదిలీ చేసి బలమైన గవర్నర్ ను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమిళనాడుకు చెందిన ఓ వెబ్ పోర్టల్ సంచలన కథనాన్నిప్రచురించింది.
కౌశిక్ రెడ్డి వ్యవహారంతో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదించని విషయం తెలిసిందే. దాంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రాష్ర్ట ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించింది. ఇందుకు సాంకేతిక కారణాలను చూపించింది. రాజ్ భవన్ లో ఉగాది వేడులకు గవర్నర్ ఆహ్వానించినా ప్రభుత్వం తరపు నుంచి ఎవరు రాలేదు. భద్రాచలం, సమ్మక్క జాతర పర్యటనలోనూ గవర్నర్ కు పరాభవం ఎదురైంది. దాంతో గవర్నర్ నేరుగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్. అవినీతి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ క్రమంలో రాష్ర్ట మంత్రులు కూడా ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తమిళిసై పై విరుచుకుపడ్డారు. చివరకు గవర్నర్ వ్యవస్థే దండగ అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కుమారుడి పెళ్లికి హాజరయ్యేందు ఢిల్లీకి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనన మంత్రులు తీవ్రంగా అవమానించారని, పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఆంగ్లమీడియా కథనం ప్రకారం..తమిళి సై కేరళకు బదిలీ కానున్నారు.పుదుచ్చేరికి సురానాను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందని వెల్లడించింది. అయితే.. తెలంగాణకు ఎవరు రానున్నారనేదానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా పేర్కొంది. కొత్త గవర్నర్ నియామకం ద్వారా కేసీఆర్ పై కేంద్రం మరింత ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీయేతర రాష్ర్టాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్నట్లుగానే కొత్త గవర్నర్ వ్యవహరిస్తే పోరు మరింత తీవ్రంగా ఉండనుందని విశ్లేషిస్తున్నారు.