తెలుగు దేశం యువ నాయకులు నారా లోకేశ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ సారి మరో పోలీస్ కేసు ఆయనపై నమోదు చేసిన వైనంపై ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ఉన్నారు పసుపు పార్టీ పెద్దలు. అనంతపురంలో మంత్రిని స్వాగతిస్తూ చేస్తున్న ర్యాలీలు అభంశుభం తెలియని చిన్నారి ప్రాణం మీదకు తీసుకువచ్చిన ఘటన పై ఇప్పటికే పోరు సాగిస్తున్న తమపై ఈ విధంగా కేసులు నమోదు చేయడం వల్ల జనాల్లో ఉన్న ఇమేజ్ కు డ్యామేజ్ రావడం ఖాయం అని అంటున్నారు.
ఆ వివరం ఈ కథనంలో..
ప్రజల పక్షాన తాను నిలబడతానని అంటున్నారు లోకేశ్. ఆ విధంగా తన పోరు సాగిస్తానని ఎందాక అయినా కొట్లాడేందుకు ఉన్న వైషమ్యాన్ని తాను భరిస్తానని, అందుకు తగ్గ విధంగా తనని తాను సిద్ధం చేసుకుంటున్నానని తరుచూ లోకేశ్ వ్యాఖ్యానిస్తున్నారు. అనంతపురం జిల్లా, కల్యాణ దుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉష శ్రీ చరణ్ ను స్వాగతిస్తూ నిర్వహించిన ర్యాలీలో పోలీసుల అతి కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు పోయాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై న్యాయ విచారణకు కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ సర్కారు తరఫున తమకు కేసులే కానుకలు అవుతున్నాయి అని పసుపు పార్టీ ఆవేదన చెందుతోంది. ఇక ఈ వివాదం ఎందాక వెళ్తుందో ?
వైసీపీ, టీడీపీ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని యుద్ధాలకు అంతేలేదు అని అంటారే ఆ విధంగా యుద్ధం కొనసాగుతోంది. తాను ప్రశ్నిస్తేనే వైసీపీ పెద్దలు భయపడిపోతున్నారని లోకేశ్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అటు టీడీపీ కీ ఇటు వైసీపీ కీ మధ్య ఉన్న వైరం కాస్త ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న వైసీపీ సర్కారు తాజాగా తనపై కూడా దృష్టి సారించి ఏం సాధిస్తుందో తామూ చూస్తామన్న అర్థం వచ్చే విధంగా లోకేశ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి రాజకీయ చర్చకు తావిచ్చారు. అయితే తాము ధర్మం ప్రకారం న్యాయ సూత్రాలు అనువర్తింప జేస్తున్నామని ఇందులో ఎటువంటి రాగ ద్వేషాలకు తావే లేదని వైసీపీ మరో వైపు వ్యాఖ్యానిస్తోంది.
తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేశ్ పై మరో కేసు నమోదు అయింది. కల్యాణ దుర్గంలో చిన్నారి ఘటనపై ప్రశ్నించినందుకు తనపై మరో కేసు నమోదు చేయడం ఎంత వరకూ సమంజసం అని నారా లోకేశ్ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇప్పటికే తనపై 11 కేసులు నమోదు చేసిన ప్రభుత్వం తాజాగా 12 వ కేసు నమోదు చేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నమోదు చేసిన కేసులు అన్నీ తప్పుడు కేసులేనని పేర్కొంటూ ప్రభుత్వాధినేతపై కొన్ని విమర్శలు చేశారు. తాను అవినీతి కేసులలో ఇరుక్కోలేదని పరోక్షంగా కొందరు ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇప్పటి దాకా ప్రశ్నించిన పాపానికే కేసులు నమోదు అయితే ఇకపై కూడా ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా అన్నారు. తనపై రౌడీ షీట్ ఓపెన్ చేసినా ఎదుర్కొనేందుకు కూడా తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన అన్నారు.