తెలంగాణలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. బుధవారం నాటికి వీటి సంఖ్య 5 లక్షలకు చేరువైంది. 8,039 గ్రూప్-4 సర్వీసుల పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తుల సంఖ్య 4,97,056కి చేరింది.
రాష్ట్రంలో 783 గ్రూప్-2 సర్వీసు పోస్టుల భర్తీకి సంబంధించి బుధవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. తొలిరోజు సాయంత్రం వరకు 15,405 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
మరోవైపు గ్రూప్-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం విధానాన్ని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. ఈ మేరకు పరీక్ష విధానం వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. ప్రధానపరీక్షలో ఒక్కోపేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పదోతరగతి స్థాయిలో ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహించనుంది.