ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని మండిపడ్డారు. కర్ణాటకలో 25మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల మాట్లాడి వారికి 500కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.
తక్కువ మెజారిటీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియడంతో వారిని ఏఐసీసీ పిలిచి మాట్లాడిందన్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని.. బీఆర్ఎస్ సమావేశానికి రాకపోవడానికి అదే కారణమని చెప్పారు.
దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పదంలో నడిపిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున ఎందుకు పోటీ చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా తమ సత్తా చాటాలనుకుంటున్న కేసీఆర్ హిమాచల్, దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు.