జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహరంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ ఛార్జిషీట్లపైనే తేల్చాలని స్పష్టం చేసింది. సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెల్లడైన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని ఆదేశించింది.

ఒకవేళ రెండూ సమాంతరంగా విచారణ జరిపినా సీబీఐ కేసులు తేలేవరకూ ఈడీ కేసులపై తీర్పు వెల్లడించరాదని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఒకవేళ సీబీఐ కేసులు వీగిపోతే.. ఈడీ కేసులే ఉండవని హైకోర్టు పేర్కొంది.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 సీబీఐ, 9 ఈడీ ఛార్జిషీట్లపై హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసులపై విచారణ ప్రారంభించాలని గతంలో సీబీఐ కోర్టును ఈడీ కోరింది.

ఇందుకు అంగీకరించిన కోర్టు.. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version