HMDAలోని చెరువుల సంరక్షణపై తెలంగాణ కీలక ఆదేశాలు

-

హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టుల పైన మంత్రి కే తారకరామారావు ఈ రోజు నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సుదీర్ఘమైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు మరియు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణపైన ప్రత్యేకంగా చర్చించారు.

ఈ సందర్భంగా చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణ కార్యకలాపాల నిర్వహణపై పైన నిపుణులతో కేటీఆర్ ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే చెరువుల సంరక్షణ పైన ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నామన్నారు. హైదరాబాద్ నగర పరిధి లేదా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు ఇందుకు అతీతం కాదని, హెచ్ఎండీఏ సైతం ఇప్పటికే అనేక చెరువులను వేగంగా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ చెరువుల సంరక్షణ తాలూకు భవిష్యత్తు కాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్ అన్నారు.

హెచ్ఎండిఏ తోపాటు జిహెచ్ఎంసి అనేక చెరువులను అభివృద్ధి చేస్తుందని, జిహెచ్ఎంసి తో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో గండిపేట వంటి అతిపెద్ద చెరువుల వద్ద ఇప్పటికే అభివృద్ధి మరియు సంరక్షణ కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. గండిపేట సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా విస్తృతస్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇది నగర ప్రజలకు ఒక అద్భుతమైన చోటుగా మారుతుందని కేటీఆర్ అన్నారు.

హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకోవలసిన చర్యల పైన మంత్రి కేటీఆర్ సంస్థ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండిఏ భౌగోళిక పరిధిలో భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కట్టుదిట్టమైన భద్రతతో కాపాడే చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రేడియల్ రోడ్ల బలోపేతం, మూసి ప్రక్షాళన, మూసి పై బ్రిడ్జిల నిర్మాణం, హెచ్ఎండిఏ ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణము, రానున్న స్వల్ప భవిష్యత్ కాలానికి హెచ్ఎండీఏ ప్రణాళిక వంటి వివిధ అంశాలపైన సైతం మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version