ఇలాంటి దుర్మార్గులకు ఈ సమాజంలో స్థానం లేదు : కేటీఆర్

-

ఝార్ఖండ్ లోని దమ్కాలో.. తన ప్రేమను అంగీకరించలేదన్న కసితో 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. నిద్రిస్తున్నప్పుడు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. అమాయకురాలి నిండు జీవితాన్ని బలితీసుకున్న దుర్మార్గుడు షారుఖ్ కు ఈ సమాజంలో బతికే హక్కు లేదని ట్వీట్ చేశారు. ఆ నిందితుడి ముఖంలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఏ మాత్రం కనిపించడం లేదని అన్నారు.

 

ఐపీసీ, క్రిమిన‌ల్ ప్రోసిజ‌ర్ కోడ్‌, జువైన‌ల్ చ‌ట్టాల‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇలాంటి నిందితుల‌కు క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను విధించాల‌ని ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిందితులు బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండాలంటే బ‌ల‌మైన చ‌ట్టాలు అవ‌స‌రం అని కేటీఆర్ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. దుమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న అంకితను ప్రేమించమని వేధింపులకు గురిచేసేవాడు షారుక్ హుస్సేన్ అనే యువకుడు. అందుకు అంకిత అంగీకరించకపోవడం వల్ల ఆగస్టు 23వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాలిన గాయాలతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడం వల్ల దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version