తెలంగాణలో తిరుగులేని నేత.. పోరాటాల గడ్డలో పుట్టిన ఈ నేత.. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయ నేతగా ఉన్నారు. ఆయన తో కలిసి పనిచేశారు.. అందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఆ నేతకు వల్లమాలిన ప్రేమ, అభిమానం. ఇప్పుడు తెలంగాణలో గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల్లో ఇతడు ఒకరు. సొంత కాంగ్రెస్ పార్టీలోనైనా సరే పనిచేయని నేతనైనా.. తనని వ్యతిరేకించే నేతలనైనా ముక్కుసూటిగా వ్యతిరేకిస్తూ, బహిరంగంగానే విమర్శిస్తూ మొండిఘటంగా పేరుంది.
అయితే అలాంటి మొండిఘటం పార్టీ నిబంధనలు పట్టించుకోకుండా నిర్భయంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని సందర్భం వచ్చినప్పుడల్లా మెచ్చుకుంటూనే ఉంటారు.. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పొగుడుతూనే ఉంటాడు.. అంతే కాదు.. మా నేత కొడుకు మా జగన్ అంటూ అనేకసార్లు జగన్‌మోహన్‌రెడ్డిని కూడా పొగిడిన సందర్భాలు అనేకం. అయితే ఇప్పుడు ఏపీలో ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత చేస్తున్న సంక్షేమ పథకాలపై వీలు చిక్కినప్పుడల్లా మెచ్చుకుంటు ఉంటారు ఈ ఎంపీ.. ఇప్పుడు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలను తూర్పార పడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన గ్రామ స్వరాజ్యంను పొగడ్తలతో ముంచెత్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో ఆలోచిస్తునాడని, అదే ఏపీ సీఎం జగన్ గ్రామ స్వరాజ్యం కోసం అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని ఈ ఎంపీ గుర్తు చేశారు. ఇకనైనా కేసీఆర్ జగన్ పాలనను చూసి నేర్చుకోవాలని హితువు పలికారు. తెలంగాణలో నిరంకుశ, నియంత తరహా పాలన కేసీఆర్ చేస్తున్నాడని దుయ్యబట్టారు ఈ ఎంపి.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో హాంకాంగ్ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, దేశంలో ఆర్థికమాంద్య ఉందని చెప్పే కేసీఆర్ తెలంగాణలో ఉన్న సచివాలయం కూల్చి కొత్తది ఎందుకు కడుతున్నాడని, హైకోర్టు తీర్పిచ్చినా కేసీఆర్ మొండిగా ముందుకు పోవడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ.
కేసీఆర్ ఓ మహిళపై గెలువాలని కుటిల యత్నాలు చేయడం సిగ్గుచేటని, సీపీఐ నేతలకు కూడా కేసీఆర్ చేసిన ఘోర అవమానాన్ని విస్మరించారని ఎంపీ దుయ్యబట్టారు.. ఇంతకు ఏపీ సీఎం జగన్‌ను పొగుడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించిన ఈ ఎంపీ ఎవరో తెలుసా.. అదేనండీ కాంగ్రెస్‌లోనే డైనమిక్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.