నిరుద్యోగుల ఉద్యమ సెగ ప్రభుత్వానికి గట్టిగానే తగిలినట్లుంది. ఇన్నాళ్లూ బెట్టుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ అడుగు దిగివచ్చింది. డీఎస్సీ లేదా గ్రూప్-2 పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గ్రూప్-2 పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్.ఇప్పటికే ఈ విషయం నిర్ణయం తీసుకున్నదని, నేడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు వెంటవెంటనే ఉన్నాయి. అయితే ఇవి రెండూ ఒకదాని వెంటే మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. డీఎస్సీని సెప్టెంబర్‌లో నిర్వహించాలని అభ్యర్థులు గతకొంతకాలంగా డిమాండ్ చేస్తూవస్తున్నారు. శుక్రవారం నాడు డీఎస్సీ వాయిదా, గ్రూప్-1 మెయిన్స్‌తోపాటు పలు సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు.