500 కొత్త విద్యుత్‌ బస్సులు అద్దెకు తీసుకోనున్న టీఎస్ఆర్టీసీ.. డిసెంబర్ నుంచి రయ్​రయ్​

-

తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 500 కొత్త విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. డిసెంబర్ నెలలో ఈ బస్సులను రోడ్డు ఎక్కించి రయ్ రయ్ అనిపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలిసారిగా ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ విభాగాల్లో విద్యుత్‌ బస్సుల్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందుకోసం బుధవారం రోజున హరియాణా వెళ్లిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కొత్త బస్సుల నిర్మాణాన్ని పరిశీలించి వాటిని అద్దెకు తీసుకోవడంపై చర్చించారు.

ఆర్టీసీలో నాలుగింట మూడొంతులు కాలం చెల్లిన బస్సులే ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొత్త బస్సులు కొనడానికి ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త బస్సులను అద్దెకు తీసుకోవాలని యోచిస్తోంది. అయితే పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ హితం దృష్ట్యా డీజిల్ బస్సులు కాకుండా విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. ప్రస్తుతం ఏసీ సర్వీసుల్లో మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులుండగా.. నాన్‌ ఏసీలోనూ వాటిని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వివిధ సంస్థలకు మొత్తం 1,860 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డర్‌ ఇచ్చింది. బస్సులు తిరిగిన దూరానికి కిలోమీటర్ల వారీగా అద్దె చెల్లింపులు ఉండనున్నాయి. హరియాణాకు చెందిన జేబీఎం సంస్థ 500 బస్సుల్ని అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news