తొమ్మిదన్నరేళ్లలో 1.60 లక్షలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశాం : కేటీఆర్

-

తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొమ్మిదన్నరేళ్లలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఎంతో కృషి చేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. లక్ష సర్కారు కొలువుల నియామకానికి హామీ ఇచ్చిన తాము తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రంలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించామని తెలిపారు. అందులో ఇప్పటికే 1.60 లక్షలకు పైగా భర్తీ చేశామని కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారంతో రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఇన్ని కొలువులు ఇచ్చినా కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల యువతలో పలు అపోహలు నెలకొన్నాయని అన్నారు. ఇటీవల యువతతో జరిపిన భేటీలో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చాయని.. ఉద్యోగాల భర్తీపై సమాచారం ఇచ్చిన తర్వాత వారిలో సంతృప్తి వ్యక్తమైందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news