తెలంగాణలో లోక్సభ ఎన్నికల నగారా మోగిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచే అధికారులు అప్రమత్తమై రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించి నగదు, మద్యం రవాణా చేసే వారిని పట్టుకుంటున్నారు. సరైన ఆధారాలు లేని నగదు, బంగారం, ఇతర వస్తువులను సీజ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో 104 కోట్ల రూపాయలు నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందులో 63కోట్లకు పైగా నగదు, 5కోట్ల 38లక్షల 12 వేల 583 విలువ గల మద్యం, దాదాపు 7కోట్ల 12 లక్షల విలువ గల మాదకద్రవ్యాలు ఉన్నట్లు చెప్పారు. 21కోట్ల 34లక్షల 75వేల 691 రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 7వేల 174 లైసెన్స్ కలిగిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో 50వేల రూపాయల కంటే ఎక్కువ నగదుతో ఎవరు ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరించారు.