ఉగ్రరూపం దాల్చిన సూర్యుడు.. రాష్ట్రంలో వడదెబ్బకు 19 మంది మృతి

-

భానుడి భగభగలకు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, కూలీలు, వృద్ధుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఎక్కడికక్కడే జనం కుప్పకూలుతున్నారు. శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో ఏకంగా 19 మంది మృతి చెందారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలు ఉక్కపోతతో విలవిలలాడాయి.

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లిపూర్‌, ధర్మపురి మండలం జైన, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7, నిజామాబాద్‌ జిల్లా జాకోరా, నారాయణపేట జిల్లా ఊట్కూరులో 46.4, నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రం, మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండల కేంద్రంలో 46.3, నల్గొండ జిల్లా బుగ్గబావిగడ్డలో 46.2 డిగ్రీల ఎండ కాసింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రతతో గాలిలో తేమ శాతం ఆవిరైపోతోందని.. దీనివల్ల వాతావరణం పొడిబారి వేడి అధికంగా ఉంటోందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news