తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ అన్నారు. ‘బస్ కా పయ్యా నహీ ఛలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హాజరై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు.