ఈ రోజు గొప్ప ఉద్విగ్నమైన క్షణం అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అంశం హాస్యాస్పదంగా ఉండేదని, గతంలో చాలామంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. గతంలో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని స్పీకర్ అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అని.. ఈ సమయంలో జయశంకర్‌ను స్మరించుకోకుండా ఉండలేమని తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ వంటి మనుషులు అరుదుగా ఉంటారన్న కేసీఆర్ .. తెలంగాణ భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరవీరులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రంసగించారు. ‘తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర చాలా గొప్పది. ఏపీ ఏర్పడిన తర్వాత కూడా టీఎన్జీవో సంఘం కొనసాగింది. ఎప్పటికైనా ఓ నాయకుడు రాకపోతాడా అని జయశంకర్ భావించారు.’ అని కేసీఆర్ పేర్కొన్నారు.