అక్టోబర్ 18వ తేదీ నుంచి నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలను మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నట్లు తెలిపింది. సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్(12710) సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.40కి గూడూరు చేరుతుంది. సవరించిన ప్రయాణ వేళల ప్రకారం రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై ఉదయం 8.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్(12764) గూడూరుకు తెల్లవారుజామున 4.43కి బదులుగా 4.19 గంటలకు, తిరుపతి స్టేషన్‌కు ఉదయం 7.15కి బదులు 6.55కి చేరుకుంటుంది. మరోవైపు లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్(12734) సాయంత్రం 6.25కి బదులుగా సాయంత్రం 5.30కి బయల్దేరనుండగా.. తిరుపతికి ఉదయం 5.55 గంటలకే వెళ్తుంది. ఏపీలోని నర్సాపూర్ నుంచి మహారాష్ట్రలోని నాగర్‌సోల్‌కి వెళ్లే నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్(17231) ప్రయాణ సమయం 10.30 నుంచి 9.40కి తగ్గనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాత్రి 11.15కి బయల్దేరి ఉదయం 9.45కి చేరుకుంటుండగా కొత్త సమయం ప్రకారం రాత్రి 9.50కి బయల్దేరి ఉదయం 7.30కి చేరుకుంటుంది.